తెలంగాణలో మరో రెండ్రోజులు వానలే! 

13 Jul, 2021 00:45 IST|Sakshi

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో స్థిరంగా అల్పపీడనం

పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాల నమోదుకు చాన్స్‌  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో రెండ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నట్లు సూచించింది. దీనికి అనుబంధంగా ఉత్తర మధ్య మహారాష్ట్ర, విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఉత్తర కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి వ్యాపించి ఉన్నట్లు వివరించింది. వాటి ప్రభావంతో రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు సైతం నమోదవుతాయని వాతావరణ శాఖ వివరించింది. 

ఈ సీజన్‌లో ఇప్పటివరకు 30 సెం.మీ. వర్షపాతం.. 
రాష్ట్రంలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 8:30 గంటల వరకు 1.93 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. నైరుతి సీజన్‌లో ఇప్పటివరకు 30.17 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవగా 16 జిల్లాల్లో అధికం, 10 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేటలో 14 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంటలో 11.8 సెం.మీ., వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఖాజీపేటలో 11.3 సెం.మీ., వరంగల్‌లో 10.1 సెం.మీ., ఖానాపూర్‌లో 10 సెం.మీ. వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు మండలాల్లో అతిభారీ, 20కిపైగా మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది.   

మరిన్ని వార్తలు