పరవళ్లు తొక్కుతున్న గోదావరి

12 Aug, 2020 11:03 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ : గోదావరి పరవళ్లు తొక్కుతోంది. గత అయిదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ రాష్ట్రాల వరద నీరు కలుస్తుండటంతో మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్‌ వద్ద గోదావరి రెండు రోజులుగా ఉధృతంగా ప్రవహిస్తోంది. సోమవారం ఉదయం నుంచే క్రమేపీ పెరుగుతూ బుధవారానికి 5.300 మీటర్ల వేగంతో ఉరకలు వేస్తోంది. మంగపేట మండలంలోని కమలాపురం బిల్ట్‌ ఇన్‌టేక్‌వెల్‌  వద్ద భుదవారం ఉదయం నుంచి గోదావరి వరద ప్రవాహం నెమ్మదిగా పెరుగుతోంది. ఆరున్నర మీటర్ల  మేర నీటి వరద సాయంత్రం వరకు పెరిగింది. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్టు జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.

రెండు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కాళేశ్వరం, తుపాకులగూడెం బ్యారేజీల వరద నీరు బొగత జలపాతం, వాగులు, ఒర్రెల నుంచి కలవడంతో క్రమేపీ గోదావరి పెరుగుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తమవుతున్నారు. ఇదేవిధంగా మంగపేట గోదావరి పుష్కరఘాట్‌ వద్ద కూడా వరద నీరు పెరిగింది. (నీటి నిర్వహణ కత్తిమీద సామే!)

రైతుల ఆనందం
గోదవారి తీర ప్రాంతం ప్రజలు, రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. తిమ్మంపేట- అబ్బాయిగూడెం గ్రామాల మధ్య ఉన్న పెద్ద చెరువు మంగళవారం తెల్లవారుజాము నుంచి మత్తడి పడి పోస్తోంది. దీంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు నిండడంతో తిమ్మంపేట, చెరుపల్లి, మల్లూరు, కొత్తమల్లూరు గ్రామాలు సుమారు 500 ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందుతుంది. మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు చేరి గోదావరి క్రమేణా పెరుగుతోంది. పేరూరు దగ్గర 9.05 మీటర్ల నీటిమట్టానికి చేరుకుందని  సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు.  (మేం గిట్లా జేస్తే కేసీఆర్‌ సీఎం అయ్యేటోడా..!)

మత్తడికి సిద్ధంగా లక్నవరం
గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు మత్తడిపోసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం 33 ఫీట్లకు నీటిమట్టం చేరగా మరో అర ఫీటు నిండితే జలాలు మత్తడి దునకనున్నాయి. ఎగువ ప్రాంతం నుంచి వరద కొనసాగుతోంది. రెండు రోజుపాటు కురిసిన వర్షాలకు సరస్సులోకి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది. ఇప్పటికే ఆయకట్టులో వరినాట్లు పూర్తయ్యాయి. సరస్సు పూర్తిస్థాయిలో నిండటంతో రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తంచేస్తున్నారు.

మరిన్ని వార్తలు