-

రోడ్లన్నీ జలమయం.. హై రెడ్‌ అలర్ట్‌

14 Oct, 2020 15:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరం తడిసిముద్దవుతోంది. వరద బీభత్సంతో రోడ్లు, పలు ప్రాంతాలు పూర్తిగా జలమయం కాగా, కాలనీలు వాగులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక హైదరాబాద్‌లో ఇప్పటివరకు మొత్తంగా 32 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వరద నీటి ఉధృతి అంతకంతకు పెరిగిపోతుండటంతో మూసీగేట్‌, హుసేన్‌ సాగర్‌ నాలుగో గేట్‌ను తెరిచారు. ఈ నేపథ్యంలో అశోక్‌నగర్‌, హిమాయత్‌నగర్‌, ముషీరాబాద్‌ తదితర ప్రాంతాల్లో హైఅలర్ట్‌ విధించారు. ఇక భారీ వర్షాలు, వరదలతో మూసారాంబాగ్ బ్రిడ్జికి రెండు వైపులా ఉన్న ఐరన్ ఫెన్సింగ్ కొట్టుకుపోయింది. మంత్రి కె. తారకరామారావు మూసారాంబాగ్ ప్రాంతాన్ని సందర్శించారు. సలీంనగర్లో ప్రజలతో మాట్లాడి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. .రానున్న ఒకటీరెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో జీహెంఎసీ ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఉండాలని కోరారు. ఆయా కేంద్రాల్లో ఆహారంతో పాటు, మందులు, వైద్యులు అందుబాటులో ఉంటారని, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.(చదవండి: పాతబస్తీ: వరద నీటిలో వ్యక్తి గల్లంతు!)

అతలాకుతలమవుతున్న భాగ్యనగరం- అప్‌డేట్స్‌

  • రోడ్లన్నీ జలమయం కావడంతో ఉప్పల్‌- ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌- కోటి రహదారిని మూసివేశారు. 
  • బేగంపేటలో వరద నీరు పొంగిపొర్లుతోంది
  • నిజాంపేటలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. బండారి లేఅవుట్‌ వరకు నీటితో నిండిపోయింది. 
  • మెహదీపట్నం- హైటెక్‌ సిటీ మార్గం మొత్తం జలమయమైంది. కూకట్‌పల్లి ఐడీపీఎల్‌, హఫీజ్‌పేట్‌ లేక్‌ల నుంచి నీరు ఉప్పొంగి బయటకు ప్రవహిస్తోంది. 
  • గచ్చిబౌలికి వెళ్లే మార్గం జలదిగ్బంధనమైంది. 
  • సోమాజిగూడ- పంజాగుట్ట, పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే, మెహదీపట్నం, టోలిచౌకి ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
  • భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణలో హై రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు.
  • బెంగళూరు హైవే, హైదరాబాద్‌- విజయవాడ హైవేను మూసివేశారు. 

నీట మునిగిన 10 లారీలు
ఎడతెరిపిలేని వర్షాలకు మూసీ నది ఉగ్రరూపం దాలుస్తోంది. ఆ ప్రభావంతో భువనగిరి- నల్గొండ రహాదారిపై ఎక్కడిక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. వలిగొండ బ్రిడ్జి పక్కన పార్క్ చేసిన 10 లారీలు నీటమునిగాయి. మరికొన్ని వరదలో కొట్టుకుపోయాయి. గతంలో ఎప్పుడు లేనంతగా వరద వలిగొండ బ్రిడ్జి వద్ద కొనసాగుతోంది. ప్రమాదకర స్థాయి కి చేరుకొంది. వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుండటంతో భారీ వాహనాలను బ్రిడ్జి పై కి అనుమతించడం లేదు.

మరిన్ని వార్తలు