వానలే..వానలు..

1 Aug, 2020 08:24 IST|Sakshi

తడిసి ముద్దవుతోన్న మహానగరం.. 

జూన్, జూలై నెలల్లో సాధారణం కంటే

 22 శాతం అధిక వర్షపాతం నమోదు

రంగారెడ్డి జిల్లాలో 33 శాతం అధికంగా వానలు

ఇంకుడుగుంతల లేమితో నీరు వృథా  

శుక్రవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం

రాగల 24 గంటల్లో భారీ వర్షసూచన

సాక్షి,సిటీబ్యూరో: వరుణుడి ప్రతాపంతో నిత్యం జోరుగా కురుస్తున్న వర్షాలతో గ్రేటర్‌ సిటీ తడిసి ముద్దవుతోంది. నైరుతి సీజన్‌ ప్రారంభమైన జూన్‌ ఒకటి నుంచి జూలై 31 వరకు రెండునెలల్లోనే నగరంలో 22 శాతం అధిక వర్షపాతం నమోదవడం విశేషం. ఈ సీజన్‌లో సెప్టెంబర్‌ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలుండడంతో ఈసారి జడివానలు మహానగరాన్ని ముంచెత్తుతాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. జూన్‌–జూలై నెలల్లో సాధారణంగా నగరంలో 276.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవుతుంది. అయితే ఈసారి ఏకంగా 338.6  మిల్లీమీటర్లమేర వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 22 శాతం అధిక వర్షపాతం నమోదైందన్నమాట. రంగారెడ్డి జిల్లా పరిధిలో సాధారణంగా 244.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా, ఏకంగా 326.2 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదవడం విశేషం. మొత్తంగా ఈ జిల్లాలో రెండు నెలల కాలంలోనే 33 శాతం అధిక వర్షపాతం నమోదైంది. కాగా ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో జడివాన కురిసింది. భారీ వర్షానికి నగరంలో లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు నీటమునిగాయి. సాయంత్రం వేళల్లో ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ ఎక్కడికక్కడే స్తంభించింది. ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకున్న వాహనదారులు ఆలస్యంగా ఇళ్లకు చేరుకున్నారు. 

వర్షపునీరు వృథా..వ్యథ.. 
గ్రేటర్‌ పరిధిలో విస్తారంగా వర్షపాతం నమోదవుతున్నప్పటికీ వాన నీటిని నేలగర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన ఇంకుడు గుంతలు లేకపోవడం, సిటీ కాంక్రీట్‌ మహారణ్యంలా మారడంతో వర్షపునీరంతా వృథాగా రహదారులపై ప్రవహించి మూసీలో కలుస్తోంది. మహానగరం పరిధిలో సుమారు 25 లక్షల గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలుండగా..ఇందులో ఇంకుడు గుంతలు 5 లక్షలకు మించి లేకపోవడంతో గ్రేటర్‌ పరిధిలో కురిసిన వర్షపాతంలో 70 శాతానికి పైగా వృథా అవుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తమ బోరుబావికి దగ్గరగా ఇంకుడు గుంతను ఏర్పాటుచేసుకోవాలని భూగర్భ జలవనరులశాఖ, జలమండలి నిపుణులు సూచిస్తున్నారు.  

పలు మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు.. 
గత రెండునెలలుగా నగరంలో అత్యధికంగా నాంపల్లి మండలంలో 45 శాతం, రాజేంద్రనగర్‌లలో 39, తిరుమలగిరిలో 41,బాలాపూర్‌లో 48 శాతం,హయత్‌నగర్‌లో ఏకంగా 55 శాతం అధిక వర్షపాతం నమోదుకావడం గమనార్హం. అత్యల్పంగా శేరిలింగంపల్లిలో 4 శాతం, మారేడ్‌పల్లిలో 2 శాతం మేర అధిక వర్షపాతం నమోదైంది. 

శుక్రవారం నగరంలో పలు చోట్ల కుండపోత  
దక్షిణ కోస్తా ఆంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లో 3.1 కి.మీ ఎత్తు నుంచి 5.8 కి.మీ ఎత్తు మధ్య కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నగరంలో పలు చోట్ల కుంభవృష్టి కురిసింది. భారీ వర్షానికి ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునగడంతో జీహెచ్‌ఎంసీ అత్యవసర బృందాలు రంగంలోకి దిగి వరదనీటిని తొలగించాయి.  పురాతన భవంతుల్లో నివాసం ఉంటున్న వారు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. పలు చోట్ల విద్యుత్‌ తీగలు తెగిపడడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాగల 24 గంటల్లో నగరంలో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. 

మరిన్ని వార్తలు