Rains In Hyderabad: హైదరాబాద్‌లో కుండపోత వర్షం: ఏటా ఇదే సీన్‌ 

28 Sep, 2021 07:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కుండపోత వర్షాలతో గ్రేటర్‌ హైదరాబాద్‌ సిటీ చిగురుటాకులా వణుకుతోంది. సోమవారం కురిసిన జడివానతో నగరజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు చెరువులను తలపించగా..లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఎడతెరిపి లేని వానతో జనం ఇళ్లనుంచే బయటకు రాలేని పరిస్థితి తలెత్తింది. వచ్చే 24 గంటల్లోనూ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హై అలర్ట్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటికి రావాలని హెచ్చరికలు జారీ చేశారు. 

హైదరాబాద్‌ పరిధిలోని మూడు లక్షల మ్యాన్‌హోల్‌ మూతలను ఎట్టి పరిస్థితుల్లో తెరవరాదని జీహెచ్‌ఎంసీ, జలమండలి హెచ్చరించాయి. గ్రేటర్‌ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో, పురాతన భవనాల్లో నివాసం ఉంటున్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. పోలీస్, జలమండలి, విద్యుత్, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పరిస్థితిని సమీక్షించాయి.   


చదవండి: Telangana: నేడు, రేపు భారీ వర్షాలు  

ఏటా ఇదే సీన్‌ 
ఏటా సెప్టెంబరులో పేరుగొప్ప మహానగరంలో ఎటు చూసినా ఇదే సీన్‌. శతాబ్దకాలంగా నగరంలో భారీ వర్షాల చరిత్రను పరిశీలిస్తే నాడు 1908లో మూసీ వరదలు..2000 సంవత్సరంలో సిటీని సగం ముంచేసిన భారీ వర్షాలు..ఇక 2016లో పలు ప్రాంతాల్లో కురిసిన కుంభవృష్టి...ఈ విపత్తులన్నీ ఇదే నెలలో చోటుచేసుకోవడం గమనార్హం.  

నిపుణుల కమిటీ సూచనల అమలేదీ..? 
మహానగరాన్ని వరదల సమయంలో నిండా మునగకుండా చూసేందుకు 2003లో కిర్లోస్కర్‌ కమిటీ విలువైన  సూచనలు చేసింది. సుమారు 1500 కి.మీ మార్గంలో విస్తరించిన నాలాలపై ఉన్న పదివేలకు పైగా ఉన్న ఆక్రమణలను తొలగించడంతోపాటు వరదనీటి కాల్వలను విస్తరించాలని సూచించింది.  జరిగిన పనులను పరిశీలిస్తే..గత కొన్నేళ్లుగా సుమారు 30 శాతమే పనులు పూర్తయ్యాయి. మరో 70 శాతం పనులు పూర్తికాకపోవడంతో భారీ వర్షం కురిసిన ప్రతీసారీ సిటీ నిండా మునుగుతోంది.  మూడేళ్ల క్రితం ముంబయి ఐఐటీ, తెలంగాణ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ప్లానింగ్‌ సంస్థల నిపుణులు ఇంకుడు కొలనులు ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో సిటీకి ముంపు సమస్య 50 శాతానికి పైగాతీరుతుందని అప్పట్లోనే స్పష్టంచేసినా యంత్రాంగం పట్టించుకోలేదు.
చదవండి: హైదరాబాద్‌లో కాస్త తగ్గుముఖం పట్టిన వర్షం..

మరిన్ని వార్తలు