జర పైలం.. రెండ్రోజులు.. జోరు వాన!

9 Jul, 2022 01:47 IST|Sakshi
భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం నడిగడ్డలో వరద నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తులు

చురుకుగా నైరుతి రుతు పవనాలు..

తోడుగా ఉపరితల ఆవర్తనం..

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు..

మరో రెండు రోజులూ భారీ వర్షాలు 

సాక్షి, హైదరాబాద్‌:  నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటం, దానికి తోడుగా ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్‌ జిల్లాల్లో పలుచోట్ల కుండపోత వాన పడింది. వాగులు వంకలు ఉప్పొంగాయి. కాలనీలు నీట మునిగాయి. రహదారులపైకి నీళ్లు చేరాయి. ఇలాగే మరో రెండు రోజులపాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తొమ్మిది జిల్లాల్లో కుండపోత వానలు పడతాయని, మరో 11 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 

సాధారణం కంటే ఎక్కువగా.. 
వానాకాలం సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 18.03 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. శుక్రవారం సాయంత్రానికల్లా 26.57 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణం కంటే 47 శాతం అధికమని వాతావరణ శాఖ పేర్కొంది. 10 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 20 జిల్లాల్లో అధిక వర్షపాతం, 3 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్టు తెలిపింది.  

ఆనందంలో రైతాంగం 
జోరుగా వానలు కురుస్తుండటంతో రైతుల్లో ఆనందం కనిపిస్తోంది. ఇప్పటికే దుక్కి దున్నిన రైతులు విత్తనాలు వేయడం, నారు మడులు సిద్ధం చేసుకోవడం మొదలుపెట్టారు. ఉద్యాన పంటల సాగు సైతం ఊపందుకుంది. కూరగాయలకు మార్కెట్లో డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో వాటి సాగువైపు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. 

బాగా తగ్గిన ఉష్ణోగ్రతలు 
రెండు రోజులుగా మబ్బు పట్టే ఉండటం, విస్తారంగా వానలు పడుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగైదు డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాత్రి ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గి చలివేస్తున్న పరిస్థితి కూడా 
కనిపిస్తోంది. 

బొగత జలపాతం పరవళ్లు 
నల్లవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. జలపాతాన్ని చూసేందుకు స్థానికులు పోటెత్తారు.  

నీటిలో చిక్కుకున్న స్కూల్‌ బస్సు 
మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం బొక్కలోనిపల్లి గ్రామ శివార్లలో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్‌ బస్సు.. శుక్రవారం ఉదయం కోయిలకొండ మండలం కేశ్వాపూర్, పెర్సివీడు, మణికొండ, రామచంద్రాపూర్, మాచన్‌పల్లి, సూగురుగడ్డ తండాలలో విద్యార్థులను ఎక్కించుకుంది. మాచన్‌పల్లి– కోడూర్‌ స్టేజీ మధ్య రైల్వే అండర్‌ పాస్‌ కింద భారీగా వరద నీరు నిలిచి ఉండగా.. డ్రైవర్‌ గమనించకుండా బస్సును ముందుకు పోనిచ్చాడు.

మధ్యలోకి వెళ్లేసరికి బస్సు నీటిలో చిక్కుకుపోయింది. అందులో ఉన్న విద్యార్థులంతా నర్సరీ నుంచి ఐదో తరగతిలోపు చిన్నారులే కావడం, అంతా భయంతో అరవడంతో.. సమీపంలో ఉన్న యువకులు వచ్చి కాపాడారు. ఒక్కొక్కరుగా 30 మంది విద్యార్థులను బయటికి తీసుకొచ్చారు. ఆర్టీఏ, పోలీస్, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 
– మహబూబ్‌నగర్‌ రూరల్‌ 

టార్చిలైట్‌ వెలుతురులో గర్భిణికి ప్రసవం.. 
భారీ వర్షం కారణంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగడంతో.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవిమల్లెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తీవ్ర ఇబ్బంది ఎదురైంది. ఇక్కడి ఎడ్లబంజరు గ్రామానికి చెందిన దుర్గాభవానికి పురుటి నొప్పులు రావడంతో వైద్యులు టార్చిలైట్, సెల్‌ఫోన్‌ లైట్ల వెలుతురులో ప్రసవం చేశారు. 

విద్యార్థులకు ‘వరద’కష్టం! 
కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానెపల్లి మండలం దిందా గ్రామ విద్యార్థుల గోస ఇది. ఉదయం పొరుగూరిలోని బడికి వెళ్లిన విద్యార్థులు.. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇలా వాగు పొంగి ప్రవహిస్తోంది. గ్రామస్తులు అక్కడికి చేరుకుని విద్యార్థులను మెల్లగా వాగు దాటించారు. 

నల్లగొండ, ఖమ్మం ఆగమాగం 
నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండడంతో రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కుండపోత వాన కురిసింది. చాలా చోట్ల గురువారం అర్ధరాత్రి నుంచే మొదలైన వాన శుక్రవారం అర్ధరాత్రి దాటినా కురుస్తూనే ఉంది. రహదారులపై నీరు పారుతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. 

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌ (ఎస్‌) మండలంలో అత్యధికంగా 19.04 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట పట్టణంలో మానస నగర్, వినాయకనగర్‌ తదితర ప్రాంతాలు నీటమునిగాయి. మద్దిరాల మండలం ముకుందాపురంలో వర్షానికి ఒక ఇల్లు కూలింది. నల్లగొండలో పానగల్‌ బైపాస్‌ రోడ్డు చెరువులా మారింది. నకిరేకల్‌లో పలు కాలనీలో జలమయం అయ్యాయి. 

ఖమ్మం ఉమ్మడి జిల్లా పరిధిలో చాలా చోట్ల వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో అధికారులు ఆయా మార్గాల్లో రాకపోకలను నిలిపివేశారు. మాటూరు సమీపంలో నిర్మాణంలోని బ్రిడ్జి వద్ద డైవర్షన్‌ రోడ్డు కొట్టుకుపోవడంతో ఆరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 20.3 అడుగులకు పెరిగింది. కిన్నెరసాని, తాలిపేరు జలాశయాలకు భారీగా వరద వస్తుండటంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

మణుగూరు మండలం కూనవరం రైల్వేగేట్‌ సమీపంలోని కోడిపుంజు వాగులో వర్సా శంకర్‌ అనే వ్యక్తి కొట్టుకుపోయాడు. భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం నడిగడ్డకు చెందిన గిరిజన మహిళ ఏనిక దుర్గమ్మ (55) గుబ్బలమంగి వాగులో గల్లంతయ్యారు. ఇదే జిల్లా పాల్వంచ మండలం దంతెలబోరుకు చెందిన బొదా నర్సిరెడ్డి పాడి గేదెల కోసం వెళ్లి కిన్నెరసాని నది మధ్యలో చిక్కుకుపోయాడు. అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఆయనను రక్షించారు. 


నర్సిరెడ్డిని కాపాడుతున్న అగ్నిమాపక సిబ్బంది   

మహబూబాబాద్‌ జిల్లాలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పాకాల ఏరు చెక్‌డ్యాంపై నుంచి వరద పొంగిపొర్లుతోంది. చిన్నగూడూరు మండలంలోని పలు ఇళ్లు జలమయం అయ్యాయి.  

మరిన్ని వార్తలు