నింగికి చిల్లు.. మునిగిన నిర్మల్‌.. సీఎం కేసీఆర్‌ ఆరా 

23 Jul, 2021 02:26 IST|Sakshi
నిర్మల్‌లో రోడ్డుపై చేపలు పడుతున్న యువకుడు

నిర్మల్‌ జిల్లాలో భారీ వర్షం..

వరదలు చెరువుల్లా మారిన నిర్మల్, భైంసా పట్టణాలు 

రోడ్లపైనే చేపలు పట్టిన స్థానికులు 

నిర్మల్‌: అది మాములు వాన కాదు.. ఆకాశానికి చిల్లు పడిందా..? అన్నట్టుగా నిర్మల్‌ జిల్లావ్యాప్తంగా జడివాన కురిసింది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం సాయంత్రం దాకా కుండపోత పోసింది. నిర్మల్, భైంసా పట్టణాలు చెరువుల్లా మా రిపోయాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జిల్లాలోని 19 మండలాలకుగాను 18 మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. నర్సాపూర్‌ (జి) మండలంలో ఏకంగా 24.5 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది.

చుట్టుముట్టిన నీళ్లు.. 
భారీగా వరదతో భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తేశారు. దాంతో దిగువన ఉన్న ఆటోనగర్‌ ప్రాంతం జలదిగ్బంధమైంది. కాలనీవాసులను, అక్కడి ఓ ఫంక్షన్‌ హాల్‌లో బసచేసిన మంది పోలీసులను రెస్క్యూ టీమ్‌ గజ ఈతగాళ్లు, తెప్పలతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్వర్ణ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో.. నిర్మల్‌ పట్టణంలోని సిద్ధాపూర్, జీఎన్‌ఆర్‌ కాలనీలు నీట మునిగాయి. స్థానికులు రెండు, మూడు అంతస్తులు ఉన్న ఇళ్లలోకి వెళ్లి తలదాచుకున్నారు. వీటితో పాటు మరికొన్ని కాలనీల్లోనూ వరద చేరింది. శివాజీచౌక్, బోయవాడ, ఇంద్రానగర్, శాస్త్రినగర్, నటరాజ్‌నగర్, ఈద్‌గాం ప్రాంతాల్లో నడుములోతు నీళ్లు నిలిచాయి. ఇళ్లలోకి నీళ్లు వెళ్లడంతో జనం ఆందోళనకు గురయ్యారు.

ప్రధాన రహదారులు కూడా నీట మునగడంతో.. పట్టణమంతా చెరువును తలపించింది. మంజులాపూర్, బంగల్‌పేట్‌ చెరువులు ఉప్పొంగి భైంసా–నిర్మల్, ఆదిలాబాద్‌–నిర్మల్, మంచిర్యాల–నిర్మల్‌ రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. కుంటాల మండలం పాతవెంకూరు, సారంగపూర్‌ మండలం వంజర్, సోన్‌ మండలం జాఫ్రాపూర్‌లలో కొందరు వరద నీటిలో చిక్కుకున్నారు. రెస్క్యూ బృందాలతో వారిని కాపాడారు. కడ్తాల్‌ వద్ద స్వర్ణ నది ఉధృతితో 44వ నంబర్‌ జాతీయ రహదారి నీట మునిగింది. దీంతో రాకపోకలను దారి మళ్లించారు. 


జీఎన్‌ఆర్‌ కాలనీలో బాధితులను రక్షిస్తున్న సహాయక బృందం 

రోడ్లపైనే చేపలు.. ఈతలు 
►స్వర్ణ నది, మంజులాపూర్, బంగల్‌పేట్‌ చెరువుల వరదలో కొట్టుకొచ్చిన చేపలు.. నిర్మల్‌ పట్టణంలో నిలిచిన నీళ్లలో చేరాయి. పలువురు స్థానికులు వలలు, చీరలతో వాటిని పట్టుకున్నారు.  
►నిర్మల్‌–ఆదిలాబాద్‌ మార్గంలో విశ్వనాథ్‌పేట్‌ వద్ద మొత్తం రోడ్డు మునిగిపోయింది. కొందరు యువకులు ఆ నీళ్లలో ఈతకొట్టారు. 

నిర్మల్‌ పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ ఆరా 
జడివానతో మునిగిన నిర్మల్, భైంసాలతోపాటు జిల్లాలోని పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ గురువారం సాయంత్రం ఆరా తీశారు. ఈ మేరకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపుతున్నట్టు తెలిపారు.

>
మరిన్ని వార్తలు