ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు

11 Aug, 2020 01:38 IST|Sakshi

నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు

17 మండలాల్లో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం..

33 జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ నమోదు

మరో రెండ్రోజులపాటు వానలు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో వర్షాలే వర్షాలు.. వానలు విస్తారంగా కురుస్తున్నాయి. రాష్ట్రం తడిసి ముదై్దయింది. జిల్లాలు జలమయ మయ్యాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 31.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. 33 జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ నమోదైంది. వాస్తవానికి ఈ నెల 10న సాధారణ వర్షపాతం 10.9 మిల్లీమీటర్లు ఉండాలి. కానీ, మూడు రెట్లు అధిక వర్షపాతం నమోదైంది. మరో రెండ్రోజులపాటు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఆర్మూర్‌లో అతిభారీ వర్షం
నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో అతిభారీ వర్షం కురిసింది. ఏకంగా 17.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. నవీపేటలో 16.6, రంజల్‌లో 13.8, కామారెడ్డి జిల్లా గాంధారిలో 13.4, కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడిలో 13, హుజూరాబాద్‌లో 12, వరంగల్‌ జిల్లా ధర్మసాగర్‌లో 12, తిమ్మాపూర్‌లో 11.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 17 మండలాల్లో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు∙వాతావరణ శాఖ ప్రకటిం చింది. 8 జిల్లాల్లో సగటున 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడం గమనార్హం. నిజామాబాద్‌లో అత్యధికంగా 8.2 సెంటీమీటర్లు నమోదుకాగా, వరంగల్‌ అర్బన్‌ 7.6, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లో 7.5, కరీంనగర్‌లో 7, సిరిసిల్లలో 6.7, కామారెడ్డిలో 6.3, మహబూబాబాద్‌లో 6, భూపాలపల్లిలో 5.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ నమోదైంది. ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్ర సగటు వర్షపాతం 44.7 సెంటీమీటర్లు కాగా, ఇప్పటివరకు 52.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 16 శాతం ఎక్కువ.

బంగాళాఖాతంలో 13న మరో అల్పపీడనం
బంగాళాఖాతంలో ఈ నెల 9న ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వానలు కురుస్తుండగా ఈ నెల 13న వాయవ్య దిశలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉరుముల, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని పేర్కొంది. రాబోయే రెండ్రోజులు అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం –ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, మెదక్‌ మరియు సంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.  

మరిన్ని వార్తలు