ఆగమాగం..నిండా మునిగిన నగరం

14 Oct, 2020 01:51 IST|Sakshi

గ్రేటర్‌ హైదరాబాద్‌ను రోజంతా ముంచెత్తిన భారీ వర్షం.. 

చిగురుటాకులా వణుకుతున్న భాగ్యనగరం.. జలదిగ్బంధంలో పలు కాలనీలు

భువనగిరిలో నీళ్లలో కొట్టుకుపోయి ఇద్దరు మృతి.. ఖమ్మంలో ఇద్దరు గల్లంతు

భూదాన్‌పోచంపల్లి శివారులో ఆర్టీసీ బస్సు బోల్తా... ప్రయాణికులు క్షేమం

కొత్తగూడెం, మహబూబాబాద్, జనగామ, సూర్యాపేట జిల్లాల్లోనూ భారీ వర్షం

రాష్ట్రంలో సగటున 2.19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి..వాతావరణ శాఖ హెచ్చరిక.. రెడ్‌ అలర్ట్‌ జారీ

సాక్షి, హైదరాబాద్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయు గుండం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళ వారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఎడ తెరపిలేకుండా కురిసిన వానతో రాష్ట్రం తడిసి ముద్దయింది. రాష్ట్రంలో మెజార్టీ ప్రాంతాల్లో నిరంతరాయంగా వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. జలాశయాలు, చెరువులు నిండుకుం డల్లా మారాయి. వాగులు, వంకలు పొంగి రాకపోక లకు అంతరాయం కలిగింది. హైదరాబాద్‌లో రోజంతా భారీ వర్షం కురవడంతో అతలా కుతలమైంది. రోడ్లపై భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు, కాలనీలు నీట మునిగాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొ ద్దని పోలీసులు హెచ్చరించారు. మంగళవారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా సగటున 2.19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తాజా వర్షాలతో రాష్ట్రంలో 15 జిల్లాల్లో అత్యధిక, 12 జిల్లాల్లో అధిక, 6 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యాయి.

రాష్ట్రంలో రెడ్‌ అలర్ట్‌
బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం కాకినాడ సమీపంలో తీరం దాటింది. మరోవైపు రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో వచ్చే 48 గంటలపాటు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతోపాటు ఈదురు గాలులు సైతం వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్రంలో రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, సిద్దిపేట, వరంగల్, హైదరాబాద్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లోని పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కాగా, బుధవారం అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. 

చెరువులైన రోడ్లు
వాయుగుండం ప్రభావంతో ఎడతెరపి లేకుండా కురిసిన వానతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ఆగమాగమైంది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టు మంగళ వారం తెల్లవారుజామున మొదలైన వర్షం.. అర్ధరాత్రి వరకు కురుస్తూనే ఉంది. పట్టుమని పది నిమిషాలు కూడా తెరపినివ్వకపోవడంతో దాదాపుగా నగరం మొత్తం జల దిగ్బంధనంలో చిక్కుకుంది. 20 ఏళ్ల తర్వాత కురిసిన రికార్డు స్థాయి వర్షానికి సిటీజనులు చిగురుటాకుల్లా వణికి పోయారు. హైదరాబాద్‌లో 44 కిలోమీటర్ల పరిధిలో ప్రవహిస్తున్న మూసీ నది ఉగ్రరూపం దాల్చడంతో దాదాపు 1,500 వందల కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన నాలాలు ఉప్పొంగాయి. వరద, మురుగునీరు పోటెత్తడంతో సుమారు 7 వేల కిలోమీటర్ల పరిధిలోని డ్రైనేజీపై ఉన్న ఉన్న పైప్‌లైన్‌ల మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లుతున్నాయి.

హుస్సేన్‌ సాగర్‌తోపాటు జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌తోపాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 185 చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. అర్ధరాత్రి 12 గంటలకు హిమాయత్‌సాగర్‌ రెండు గేట్లు ఎత్తి 1,300 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేశారు. వందలాది బస్తీలు, కాలనీలు, ప్రధాన రహదారులపై నడుము లోతున నీరు పోటెత్తింది. పలు బస్తీల్లో  ఇళ్లలోకి చేరిన వరద నీటిని తొలగించేందుకు బస్తీవాసులు నానా అవస్థలు పడ్డారు. చెరువులు, కుంటలను ఆనుకుని ఉన్న బస్తీల్లో వరద ఉధృతి అధికంగా ఉండటంతో బస్తీల వాసులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో 17 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.  అత్యధికంగా సింగపూ ర్‌ టౌన్‌షిప్‌లో 29.2 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. ఇక వర్ష బీభత్సం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించిపోవడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడి అంధకారం అలుముకుంది. వర్షవిలయం కారణంగా గ్రేటర్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు. 

అంతా జలమయం..
హైదరాబాద్‌లో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నగరం మొత్తం జలమయమైంది. దీంతో మూసీ తీరప్రాంత ప్రజలను, నాలాలకు ఆనుకుని ఉన్న బస్తీవాసులను రెవెన్యూ, పోలీసు, బల్దియా యంత్రాంగం అప్రమత్తం చేసింది. పలు కాలనీలు, బస్తీల్లో ఇళ్లలోకి చేరిన వర్షపు నీటిని జీహెచ్‌ఎంసీ అత్యవసర బృందాలు మోటార్లు, జెట్టింగ్‌ యంత్రాల సాయంతో తొలగిస్తున్నాయి. వర్ష బీభత్సానికి పాతనగరం సహా పలు ప్రాంతాల్లో శిథిల భవనాలు, చెట్లు నేలకూలాయి. రాగల 24 గంటల్లో నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురవచ్చని బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం 6 గంటల వరకు సరాసరిన 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నగరంలో వచ్చే 24 గంటల్లో 10–15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలుండడంతో జీహెచ్‌ఎంసీ, జలమండలి, పోలీసు, రెవెన్యూ విభాగాల సిబ్బందిని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది.. శిథిల భవనాల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించారు.  

మరిన్ని వార్తలు