మత్తడి దూకిన చెరువు.. రోడ్డు మీదే చేపల వేట

22 Jul, 2021 14:07 IST|Sakshi

జగిత్యాల  సిరికొండలో రోడ్డు మీదకు కొట్టుకొచ్చిన చేపలు

సాక్షి,కరీంనగర్‌: రెండు, మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాల వల్ల జనజీవన అస్తవ్యస్తం కాగా.. చెరువులు మత్తడి దూకుతున్నాయి. ఫలితంగా చెరువులో ఉండాల్సిన చేపలు రోడ్డు మీదకు కొట్టుకొచ్చాయి. వీటి కోసం జనాలు ఎగబడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

భారీ వర్షాల కారణంగా జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాలు జలమయం అయ్యాయి. కథలాపూర్‌ మండలం సిరికొండలో చెరువు నిండి మత్తడి దూకింది. ఫలితంగా చేపలు రోడ్ల మీదకు కొట్టుకొచ్చాయి. వీటిని పట్టుకునేందకు గ్రామస్తులు భారీగా రోడ్ల మీదకు చేరుకున్నారు. ఎవరికి అందిన కాడికి వారు చేతపట్టుకుని ఇళ్లకు చేరారు. 

రానున్న 48 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి ప్రభావం వల్లే తెలంగాణ వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని.. ఇలాగే వర్షాలు పడతాయని వివరించారు.

>
మరిన్ని వార్తలు