ముంపులో 2 లక్షల ఎకరాలు! 

7 Sep, 2021 03:33 IST|Sakshi
భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం బేతాళపాడులో వర్షాలకు నీట మునిగి ఇసుక మేటలు వేసిన పత్తి పంట

ఎడతెరిపి లేని వర్షాలతో నీటమునిగిన పంటలు

వరిలో మురుగునీటిని తీసేయాలంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు

వర్షాలు తగ్గేదాకా మందులు పిచికారీ చేయొద్దని రైతులకు సూచన

పత్తిలో వడల తెగులు ఆశించే అవకాశం ఉందని హెచ్చరిక  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల దాదాపు 2 లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగాయని వ్యవసాయశాఖ వర్గాలు అంచనా వేసినట్లు తెలిసింది. అయితే పూర్తిస్థాయి అంచనాలను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ప్రస్తుత వర్షాల వల్ల పంటలకు వచ్చిన ముప్పేమీ లేదని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వచ్చే రెండ్రోజుల్లోనూ అన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు తమ సూచనలు పాటించాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించింది. ఈ మేరకు అత్యవసర బులెటిన్‌ విడుదల చేసింది. 

రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచనలు ఇవీ... 

భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో వర్షాధార పంట పొలాల్లోంచి మురుగునీటిని తీసేయాలి. మురుగునీరు పోవడానికి కాలువలు చేసుకోవాలి. 
రెండు రోజుల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నందున పంటల్లో మందులను పిచికారీ చేయడం వాయిదా వేసుకోవాలి. 
ముంపునకు గురైన వరి పొల్లాల్లో నత్రజని ఎరువులు వేయడం తాత్కాలికంగా ఆపాలి. 
ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు సోకేందుకు అనుకూలమన్నారు. తొలిదశ వ్యాప్తి నివారణకు, మురుగు నీటిని తొలగించి అగ్రిమైసిన్‌ ప్లాంటోమైసిన్‌ మందును నిర్ణీత మోతాదులో ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 
వరిలో ఆకుముడత సోకేందుకు అనుకూలత ఉన్నందున.. నివారణకు ఎసిఫేట్‌ లేదా కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ మందును నిర్ణీత కొలతలో లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 
పత్తిలో వడల తెగులు సోకడానికి అనుకూల పరిస్థితులు ఉన్నందున తెగులును గమనిస్తే నివారణకు కాపర్‌ ఆక్సీ–క్లోరైడ్‌ మందును ఒక లీటర్‌ నీటికి కలిపి మొక్క మొదలు చుట్టూ నేలను తడపాలి. 
కాయ కుళ్లు తెగులు నివారణకు 10లీటర్ల నీటికి నిర్ణీత మో తాదులో పౌషామైసిన్‌ లేదా స్ట్రెప్టోసైక్లిన్‌ మందును కలిపి 15 రోజుల వ్యవధిలో మూడు సార్లు పిచికారీ చేసుకోవాలి. 
ఆకుమచ్చ తెగులు, రసం పీల్చే పురుగుల నివారణకు నిర్ణీత మోతాదులో కార్బెండజిమ్, ఎసిఫేట్‌ మందును లీటరు నీటికి కలిపి పైరుపై చల్లాలి. 
పత్తిలో గూడు రాలు నివారణకు నిర్ణీత మోతాదులో ప్లానోఫిక్స్‌ మందును పది లీటర్ల నీటికి కలిపి పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. వర్షాలు తగ్గాక పైపాటుగా అదనపు మోతాదుగా ఎకరానికి 35 కిలోల యూరియా, 10 కిలోల పోటాష్‌ వేసుకోవాలి. ఒకవేళ పైపాటుగా ఎరువులు వేయలేని పక్షంలో నిర్ణీత మోతాదులో మల్టి–కే మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 
కందిలో పైటోఫ్తారా ఎండు తెగులు నివారణకు నిర్ణీత మోతాదులో కాపర్‌ ఆక్సీ–క్లోరైడ్‌ మందును ఒక లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్లను పూర్తిగా తడపాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు నిర్ణీత మోతాదులో కార్బెండజిమ్‌ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 
వర్షాలు ఆగాక నిర్ణీత మోతాదులో మల్టీ–కే మందును ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 
మొక్కజొన్నలో ఎర్వినియ ఎండు తెగులు నివారణకు 100 కిలోల వేప పిండి, 4 కిలోల బ్లీచింగ్‌ పౌడర్‌ కలిపి పొలమంతా చల్లుకోవాలి. 
► సోయా చిక్కుడు పంటలు సాగు చేసే రైతులు ౖవర్షాలు తగ్గాక నేలలో పైపాటుగా ఎరువులు వేయలేని పక్షంలో నిర్ణీత మోతాదులో యూరియా లేదా మల్టీ–కే మందును ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. 
సోయాచిక్కుడులో ఆకుమచ్చ తెగులు నివారణకు నిర్ణీత మోతాదులో కార్బెండజిమ్‌+మాంకోజెబ్‌ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 

మరిన్ని వార్తలు