ఉప్పొంగుతున్న ప్రాణహిత

14 Aug, 2020 05:12 IST|Sakshi

మేడిగడ్డ వద్ద 3.79 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

ఈ సీజన్‌లో ఇవే పెద్ద ప్రవాహాలు.. మరింత పెరిగే అవకాశం: సీడబ్ల్యూసీ

 మేడిగడ్డ పంపులు నిలిపివేత.. అన్నారం, సుందిళ్ల నుంచి 

కొనసాగుతున్న ఎత్తిపోత

సాక్షి, హైదరాబాద్ ‌: గోదావరి ఎగువన రెండ్రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత పరవళ్లు తొక్కుతోంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు నిండి ఆ నీరంతా వచ్చి చేరుతుండటంతో ప్రాణహిత ఉప్పొంగుతోంది. ఇదే సమయంలో గోదావరి పరీవాహకంలోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో రెండు నదులు కలిసే కాళేశ్వరం వద్ద గోదావరిలో 3.79 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు నమోదవుతున్నాయి. ఈ మొత్తం సీజన్‌లో ఇవే గరిష్ట ప్రవాహాలు కాగా, మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం ఇప్పటికే తెలంగాణతో పాటు పరీవాహక రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

అన్నారం, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు..
అన్నారం బ్యారేజీలోకి స్థానికంగా ఉన్న మానేరు నది నుంచి 24 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తున్నాయి. దీనిలో 10.87 టీఎంసీలకు 9.25 టీఎంసీల మేర నీటి నిల్వ ఉండటంతో 8 పంపుల ద్వారా 20వేల క్యూసెక్కులకు పైగా నీటిని సుందిళ్లలోకి పంపింగ్‌ చేస్తున్నారు. సుందిళ్లకు వస్తున్న నీటిని వచ్చినవి వచ్చినట్లు ఎల్లంపల్లికి పంపింగ్‌ చేస్తున్నారు. ఎగువ పంపింగ్‌ చేస్తున్న నీటికి తోడు స్థానిక ప్రవాహాలు కలిసి ఎల్లంపల్లిలోకి ప్రస్తుతం 25,916 క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తున్నాయి. దీంతో ఎల్లంపల్లిలో నీటి నిల్వ 20.18 టీఎంసీలకు గాను 12 టీఎంసీలకు చేరింది. ఇక్కడి నుంచి నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా మిడ్‌మానేరుకు నీటి తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం మిడ్‌మానేరులోకి 21వేల క్యూసెక్కుల మేర నీటిని ఎత్తిపోస్తుండగా నిల్వ 25.87 టీఎంసీలకు 15.31 టీఎంసీలకు చేరింది. అన్నారం నుంచి మిడ్‌మానేరు వరకు కాళేశ్వరం ద్వారా గోదావరి ఎత్తిపోతలను మరో వారం పాటు కొనసాగించనున్నారు. రోజుకు రెండు టీఎంసీల చొప్పున కనీసంగా 14 టీఎంసీల నీటిని ఎత్తిపోసినా మిడ్‌మానేరు, ఎల్లంపల్లి పూర్తిగా నిండనున్నాయి. ఇక శ్రీరాంసాగర్‌లోకి నీటి ప్రవాహాలు స్థిరంగా నమోదవుతున్నాయి. ప్రాజెక్టులోకి 23,522 క్యూసెక్కుల మేర వరద వస్తుండగా, ప్రాజెక్టులో నిల్వ 90 టీఎంసీలకుగాను 41 టీఎంసీలకు చేరింది. ఇప్పటివరకు ప్రాజెక్టులోకి మొత్తంగా 27 టీఎంసీల మేర కొత్త నీరు వచ్చి చేరింది.

‘కాళేశ్వరం’ జలజల
కాళేశ్వరం వద్ద ఏటా జూన్‌ రెండో వారం నుంచే ప్రవాహాలు మొదలవుతుండగా, ఈ ఏడాది జూలై మొదటి వారం నుంచి ప్రవాహాలు మొదలయ్యాయి. గతేడాది జూలై మొదటి వారం నుంచే 50వేల క్యూసెక్కులకు పైగా నీరు రాగా, ఈ ఏడాది జూలై చివరి వారం నుంచి 50వేల నుంచి 1.10 లక్షల క్యూసెక్కుల వరకు ప్రవాహాలు వచ్చా యి. అయినా అవి మళ్లీ 80వేల క్యూసెక్కులకు తగ్గిపోయాయి. ఇటీవలి వర్షాలతో కాస్త పుంజుకొని, ఈ నెల 11న 83వేల క్యూసెక్కుల మేర నమోదుకాగా, 12న 2లక్షల క్యూసెక్కులకు పెరిగాయి. ఇక 13న గురువారం ఏకంగా 3.79 లక్షల క్యూసెక్కులకు చేరింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో ఇప్పటికే 16.17 టీఎంసీలకు గాను 9.20 టీఎంసీల మేర నీటి నిల్వ ఉండటంతో అన్ని గేట్లు ఎత్తి 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ నదిలోకి వదిలేస్తున్నారు. ఇక మేడిగడ్డ పంప్‌హౌస్‌లోని పంపులను సైతం నిలిపివేశారు. 


 

మరిన్ని వార్తలు