బస్సు డ్రైవర్‌ను బెదిరించిన ఇద్దరిపై కేసు: వీసీ సజ్జనార్‌

9 Nov, 2021 21:15 IST|Sakshi

కారు నంబర్‌ ఆధారంగా డ్రైవర్‌ ఫిర్యాదు

ట్విట్టర్‌లో వెల్లడించిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌

దాడికి యత్నించింది ముషీరాబాద్‌వాసులుగా గుర్తింపు

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎమ్మెల్యే కారుకే సైడ్‌ ఇవ్వవా..’అంటూ ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌ను బెదిరించిన ఘటనలో షాద్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. ఆదివారం మధ్యాహ్నం వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు షాద్‌నగర్‌ మీదుగా జడ్చర్ల వైపు వెళుతోంది. వెనుక నుంచి ఎక్స్‌యూవీ వాహనంలో వచ్చిన వ్యక్తులు షాద్‌నగర్‌ పరిధిలోని బూర్గులగేటు సమీపంలో జాతీయ రహదారిపై తమ వాహనాన్ని అడ్డంగా నిలిపారు.
చదవండి: ఎమ్మెల్యే వాహనానికే సైడ్‌ ఇవ్వవా.. 

ఎమ్మెల్యే వాహనానికే సైడ్‌ ఇవ్వవా.. అంటూ బస్సు డ్రైవర్‌ రఘువర్ధన్‌రెడ్డితో దుర్భాషలాడారు. కర్రతో ఆయనపై దాడికి యత్నించారు. తాము ఎమ్మెల్యే అ నుచరులమంటూ హల్‌చల్‌ చేశారు.ఈ దృశ్యాల ను కొందరు ప్రయాణికులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

 

స్పందించిన ఎండీ వీసీ సజ్జనార్‌  
బస్సు డ్రైవర్‌పై దాడికి యత్నించిన ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ స్పందించారు. డ్రైవర్‌పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బెదిరింపులకు పాల్పడిన వారిపై స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేయాలని ఆయన సూచనతో షాద్‌నగర్‌ డీఎం శివశంకర్, డ్రైవర్‌ రఘువర్ధన్‌రెడ్డి ఆదివారం రాత్రి షాద్‌నగర్‌ పోలీసులకు ఎక్స్‌యూవీ వాహనం నంబర్‌ (టీఎస్‌ 09 ఎఫ్‌ఏ 0809 ) ఆధారంగా ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఐపీసీ 341, 353, 506, 290, 34 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సుందరయ్య తెలిపారు.

బెదిరింపులకు పాల్పడిన వారు హైదరాబాద్‌ ముషీరాబాద్‌ పరిధిలోని రాంనగర్‌ చెందిన వినోద్‌గా గుర్తించారు.ఈమేరకు అతడితోపాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. దాడికి యత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు విషయాన్ని ఎండీ సజ్జనార్‌ సోమవారం తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు. చట్టం తన పని తాను చేస్తుంది. చట్టాన్ని పౌరులెవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు. చట్టంముందు అందరూ సమానులేననన్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.  

మరిన్ని వార్తలు