పొలం అమ్ముకొని సినిమా తీశా.. ఇండస్ట్రీలో వివక్ష బాధాకరం

22 Nov, 2021 13:03 IST|Sakshi
సినిమా హీరో నరేన్‌  

డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రాలేదు

ఫిలిం ఇండస్ట్రీలో వివక్ష బాధాకరం

వరంగల్‌ బిడ్డగా గర్వంగా ఉంది

'సాక్షి’తో ‘ఊరికి ఉత్తరాన’ సినిమా హీరో నరేన్‌

సాక్షి, హన్మకొండ చౌరస్తా: ప్రసుత్త సమాజంలో కొందరు కులపిచ్చితో పరువు హత్యలకు పాల్పడుతుంటే.. సినిమా పరిశ్రమలోనూ కొత్త నటులపై వివక్ష కొనసాగుతోందని, ఈక్రమంలో పొలం అమ్ముకొని తీసిన సినిమా విడుదలకు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రాకపోవడం బాధాకరమని యువ నటుడు, ‘‘ఊరికి ఉత్తరాన’’ హీరో వనపర్తి నరేందర్‌ అలియాస్‌ నరేన్‌ అన్నారు. డబ్బు, బ్యాక్‌గ్రౌండ్‌ ఉంటేనే ఫిలిం ఇండస్ట్రీలో స్థానం ఉంటుందనే భావన కలిగేలా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఈనెల 19న విడుదలైన సినిమా విజయోత్సవ యాత్రలో భాగంగా సినిమా యూనిట్‌ వరంగల్‌కు వచ్చింది. ఈ సందర్భంగా సినీ హీరో నరేన్‌ ‘సాక్షి’తో పంచుకున్నారు.

మాది వరంగల్‌ జిల్లాలోని దుగ్గొండి మండలం, రేబల్లె గ్రామానికి చెందిన వనపర్తి కొమురమ్మ, వెంకటయ్య దంపతుల కుమారుడు నరేన్‌. హనుమకొండలో డిగ్రీ పూర్తి చేశాక, ఎంసీఏ కోసం 2003లో హైదరాబాద్‌ వెళ్లి.. కృష్ణానగర్‌లో గది అద్దెకు తీసుకుని చదువుతూ అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగేవాడు. ఎలాగైనా సినిమా తీయాలన్న నా కోరికతో ఊరిలో ఉన్న మూడెకరాల పొలం, రెండు ప్లాట్లు అమ్ముకొని జబర్తస్త్‌ ఫణీ, ఉదయ్‌తో కలిసి  నాన్న వెంకటయ్య గణేష్‌రెడ్డి బీవీఎం నిర్మాతలుగా ఊరికి ఉత్తరాన సినిమా రూపొందించాడు.

మూడు దశాబ్దాల క్రితం ఓ గ్రామంలో జరిగిన ప్రేమ వివాహం యువకుడి హత్య తమ కథావస్తువుగా రూపొందించామని నరేన్‌ తెలిపారు. సినిమా షూటింగ్‌ ఎక్కువ శాతం వరంగల్‌లోని పర్వతగిరి మండలం వడ్లకొండ గడీ, ఖిలావరంగల్, హైదరాబాద్‌ ప్రాంతాల్లో తీశామన్నాడు. సినిమా విడుదలకు ఒక్క డిస్ట్రిబ్యూటర్‌ ముందుకు రాలేదని తప్పనిసరి పరిస్థితుల్లో మరో రూ.60లక్షల తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో 100 థియేటర్లలో స్వతహాగా ఈ నెల 19న విడుదల చేశాం.   

మరిన్ని వార్తలు