పాక్షికంగా కేసుల భౌతిక విచారణ 

1 Aug, 2021 04:01 IST|Sakshi

ఈ నెల 9 నుంచి సెప్టెంబర్‌ 9 వరకు హైకోర్టులో ప్రయోగాత్మకంగా అమలు

రేపట్నుంచి సెప్టెంబర్‌ 9 వరకు కింది కోర్టుల్లో కూడా...

టీకా తీసుకున్న లాయర్లకే ప్రవేశం: హైకోర్టు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గిన నేపథ్యంలో కేసుల విచారణను ఈ నెల 9 నుంచి సెప్టెంబర్‌ 9 వరకు ప్రయోగాత్మకంగా పాక్షికంగా భౌతిక పద్ధతిలో చేపట్టడంతోపాటు ఆన్‌లైన్‌లోనూ చేపట్టాలని హైకోర్టు నిర్ణయించింది. అయితే ఈ నెల 8 వరకు మాత్రం ప్రస్తుతమున్న ఆన్‌లైన్‌ విధానంలోనే కేసుల విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. సోమ, మంగళవారాల్లో ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనంతోపాటు ముగ్గురు సింగిల్‌ జడ్జీలు భౌతికంగా కేసులను విచారిస్తారని, బుధ, గురువారాల్లో న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఎస్‌. రామచందర్‌రావు, జస్టిస్‌ టి. వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనంతోపాటు ముగ్గురు సింగిల్‌ జడ్జీలు భౌతికంగా కేసులను విచారిస్తారని హైకోర్టు తెలిపింది.

ఆ తర్వాత రెండు రోజులు న్యాయమూర్తులు జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనంతోపాటు ముగ్గురు సింగిల్‌ జడ్జీలు భౌతికంగా కేసులను విచారిస్తారని పేర్కొంది. హైకోర్టుతోపాటు కింది కోర్టుల్లో వ్యాక్సిన్‌ వేయించుకున్న న్యాయవాదులనే కోర్టు హాల్లోకి అనుమతించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు వ్యాక్సిన్‌ తీసుకున్న సర్టిఫికెట్‌ను వెంట ఉంచుకోవాలని సూచించింది. అలాగే హైకోర్టుతోపాటు కిందిస్థాయి కోర్టులు, ట్రిబ్యునళ్లలో ఆయా రోజుల్లో కేసులు విచారణలో ఉన్న న్యాయవాదులనే అనుమతిస్తామని పేర్కొంది. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తప్పనిసరిగా కరోనా నిబంధనలను పాటించాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ వెంకటేశ్వర్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 

రేపట్నుంచి సెప్టెంబర్‌ 9 వరకు కింది కోర్టుల్లోనూ... 
సోమవారం నుంచి సెప్టెంబర్‌ 9 వరకు కింది కోర్టులు, ట్రిబ్యునళ్లలో పాక్షికంగానే భౌతికంగా కేసుల విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాల్లో మాత్రం ఈ నెల 8 వరకు ఆన్‌లైన్‌లోనే విచారణ కొనసాగించాలని స్పష్టం చేసింది. సీబీఐ, ఏసీబీ, నాంపల్లి, సిటీ సివిల్‌ కోర్టు, వరంగల్‌ జిల్లా కోర్టుల్లో ప్రస్తుతం కొనసాగిస్తున్న విధానంలోనే పాక్షికంగా ప్రత్యక్షంగా కేసులను విచారించాలని పేర్కొంది. తుది విచారణ దశలో ఉన్న కేసుల్లో ముందుగా సమాచారం ఇచ్చి భౌతికంగా లేదా ఆన్‌లైన్‌ ద్వారా వాదనలు వినిపించే అవకాశం న్యాయవాదులకు ఉంటుందని తెలిపింది.   

మరిన్ని వార్తలు