అంత సమయం ఇవ్వలేం

28 Jul, 2021 03:41 IST|Sakshi

మూడు వారాల్లో స్థలం అప్పగించండి

ఐఎఫ్‌ఎస్‌ అధికారి భార్యకు ప్లాట్‌ కేటాయింపుపై సర్కారుకు హైకోర్టు ధర్మాసనం ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: అఫ్ఘానిస్తాన్‌ రాజధాని కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయంపై ఉగ్రవాద దాడిలో మృతిచెందిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి వి.వెంకటేశ్వర్‌రావు కుటుంబానికి ఇంటిస్థలం అప్పగింతకు మూడు నెలల సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభు త్వం కోరడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దాదాపు 12 ఏళ్లుగా బాధిత కుటుంబం స్థలం కోసం ఎదురు చూస్తోందని, అంత సమయం ఇవ్వలేమని, 3 వారాల్లో ఇంటి స్థలం కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. భరణి లేఔట్‌లో కేటాయించనున్న ప్లాట్‌ నంబర్‌ 54ను వారం రోజుల్లో వెంకటేశ్వర్‌రావు భార్య మాలతీరావుకు చూపించాలని, ఆ ప్లాట్‌ తీసుకునేందుకు ఆమె అంగీకరిస్తే మరో 2 వారాల్లో కేటాయించాలని, ఆగస్టు 23లోగా ప్లాట్‌ అప్పగింతకు సంబంధించిన పూర్తి వివరాలను పేర్కొంటూ సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తన భర్త 2008లో తీవ్రవాదుల దాడిలో చనిపోయారని, ఇంటి స్థలం కేటాయిస్తూ 2014లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవో జారీచేసినా ఇప్పటికీ స్థలం అప్పగించలేదంటూ మాలతీరావు రాసిన లేఖను ధర్మాసనం గతంలో సుమోటో పిటిషన్‌గా విచారణకు స్వీకరించింది. మాలతీరావు అంగీకరిస్తే భరణి లేఔట్‌లోనే గతంలో కేటాయించిన ప్లాట్‌ నంబర్‌ 58 బదులుగా 475 గజాల స్థలం ఉన్న ప్లాట్‌ నంబర్‌ 54 ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రెవెన్యూ శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది భాస్కర్‌రెడ్డి నివేదించారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించడంతో...కనీసం 4 వారాల సమయం అయినా ఇవ్వాలని కోరారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం ఆగస్టు 23లోగా ప్లాట్‌ కేటాయింపు ప్రక్రియ పూర్తిచేసి మాలతీరావుకు అప్పగించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు