‘ఉస్మానియా’ను ఏం చేస్తారు?

26 Feb, 2021 04:09 IST|Sakshi

మరమ్మతులు చేస్తారా? కొత్త భవనాలను నిర్మిస్తారా? 

ఆరేళ్లయినా ఇంకా నిర్ణయం తీసుకోరా? 

సర్కారు తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం 

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా ఆసుపత్రికి మరమ్మతులు చేస్తారా? లేక నూతన భవనాలను నిర్మిస్తారా? ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకుని తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దాదాపు ఆరేళ్లు గడిచినా ఈ వ్యవహారంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం శోచనీయమని పేర్కొంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలను 4 వారాల్లో సమర్పించాలని, ఉస్మానియా ఆసుపత్రి స్థలంతో పాటు భవనాలకు సంబంధించిన సైట్‌ ప్లాన్, గూగుల్‌ మ్యాప్‌ తదితర వివరాలతో నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. చారిత్రక కట్టడమైన ఉస్మానియా ఆసుపత్రిని కూల్చకుండా ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది.

ఉస్మానియా ఆసుపత్రి భవనానికి మరమ్మతులు చేయాలా లేదా భవనాలు కూల్చేసి కొత్త భవనాలు నిర్మించాలా అన్న దానిపై ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ నివేదించారు. ఈ పిల్‌ 2015లో దాఖలైందని, ఆరేళ్లయినా నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడమేంటని ధర్మాసనం ప్రశ్నించింది. గత విచారణ సందర్భంగా సైట్‌మ్యాప్, గూగుల్‌ మ్యాప్‌లను సమర్పించాలని ఆదేశించినా ఎందుకు ఇవ్వలేదంటూ అసహనం వ్యక్తం చేసింది.

చారిత్రక భవనాలను హెరిటేజ్‌ భవనాల జాబితా నుంచి తొలగించి వాటిని కూల్చేసేందుకు ప్రభుత్వం జీవో–183 జారీ చేసిందని, ఈ జీవో చట్ట విరుద్ధమని ఇటీవల ఎర్రమంజిల్‌ భవనాల పరిరక్షణలో భాగంగా ఇచ్చిన తీర్పులో హైకోర్టు స్పష్టం చేసిందని పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. హెరిటేజ్‌ భవనాలను కూల్చే అధికారం ప్రభుత్వానికి లేదని నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్‌ 22కు వాయిదా వేసింది.   

మరిన్ని వార్తలు