సర్కారు తీరుపై హైకోర్టు అసహనం

28 Jul, 2020 02:44 IST|Sakshi

మా ఆదేశాలు అమలు కావడం లేదు

నేడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరుకావాలి

కంటైన్‌మెంట్‌ జోన్లపై రహస్యమెందుకు?

కీలక సమాచారం ప్రజలకు తెలియజేయడం లేదు

విచారణ నేటికి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మీడియా బులెటిన్‌లో కరోనా కేసులకు సంబంధించిన కీలక సమాచారం వెల్లడించాలంటూ పలుమార్లు తామిచ్చిన ఆదేశాలు అమలు చేయడం లేదంటూ మండిపడింది. కరోనా చికిత్సలో భాగంగా ప్రజలకు తెలియజేయాల్సిన కీలక సమాచారాన్ని ఎందుకు దాస్తున్నారని ప్రశ్నిం చింది. కంటైన్‌మెంట్‌ జోన్ల వివరాలు ప్రకటించాలని తాము పలుమార్లు ఆదేశించినా ఆ వివరాలను ఎందుకు రహస్యంగా పెడుతున్నారని నిలదీసింది. మా ఆదేశాల అమలులో ఏమైనా ఇబ్బందులుంటే తెలియజేయవచ్చని, అలాకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అంటూ మండిపడింది. మంగళవారం జరిగే విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) హాజరుకావాలని, ఎందుకు మా ఆదేశాలు అమలు కావడం లేదో ఆయన్నే అడిగి తెలుసుకుంటామని స్పష్టం చేసింది. పరిస్థితి చేయిదాటక ముందే ప్రభుత్వం స్పందిస్తే బాగుంటుందని అభిప్రాయపడింది.

బోధనాసుపత్రుల్లో కరోనా రోగులకు చికిత్స అందించాలని, కరోనా టెస్టులు ఉచితంగా చేయాలని, కరోనా చికిత్సకు కేటాయించిన ఆసుపత్రుల్లో ఎన్ని వెంటిలేటర్‌ బెడ్లు అందుబాటులో ఉన్నాయో తెలిపేలా ఆదేశించాలని, వైద్య బీమా ఉన్న వారికి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా కరోనా చికిత్సలు అందించేలా ఆదేశించాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. కంటైన్‌మెంట్‌ జోన్ల సమాచారాన్ని వెల్లడించి....వాటికి సమీపంలోనే కోవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేసేలా ఆదేశించాలని న్యాయవాది వసుధా నాగరాజ్‌ సూచించారు.

మురికివాడల్లో ఇరుకు గదుల్లో ఉంటారు కాబట్టి ఒకరు కరోనా బారినపడినా విపరీతంగా ప్రబలే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కరోనా బారినపడిన వారిని కోవిడ్‌ కేర్‌ కేంద్రాలకు తరలిస్తే కొంతవరకు వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చని సూచించారు. ప్రైవేటు ఆసుపత్రులు అధిక చార్జీలు వసూలు చేస్తున్న వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం సమావేశం నిర్వహించి ఓ నివేదిక సమర్పించిందని న్యాయవాది ఎన్‌ఎస్‌ అర్జున్‌కుమార్‌ నివేదించారు. ఆ నివేదిక ప్రకారం ప్రైవేటు ఆసుపత్రుల్లో చార్జీల నియంత్రణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, సీజీహెచ్‌ఎస్‌ ధరల ప్రకారమే ప్రైవేటు ఆసుపత్రులు చార్జీలు వసూలు చేయాలని సూచించిందని పేర్కొన్నారు. విచారణ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. మంగళవారం జరిగే విచారణకు సీఎస్, ఏజీతో పాటు ఇతర అధికారులు కూడా హాజరుకావాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. 

>
మరిన్ని వార్తలు