మాజీ సైనికుడికి గౌరవం ఇదేనా?

24 Aug, 2021 01:35 IST|Sakshi

రెండువారాల్లోగా భూమి అప్పగించకపోతే 50వేలు చెల్లించండి

రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశం   

సాక్షి, హైదరాబాద్‌: మాజీ సైనికుడికి నిబంధనల మేరకు భూమి కేటాయించినా రెవెన్యూ అధికారులు అప్పగించకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రెండు యుద్ధాల్లో పాల్గొన్న సైనికుడికి మీరిచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించింది. రెండు వారాల్లోగా భూమి కేటాయించి సైట్‌ ప్లాన్‌తోపాటు అప్పగించాలని గత జూన్‌ 15న ఆదేశించినా ఇప్పటికీ అమలు చేయకపోవడంపై మండిపడింది. రెండు వారాల్లో భూమి అప్పగించకపోతే రూ.25 వేలు జరిమానాగా పిటిషనర్‌కు చెల్లించాల్సి వస్తుందని తమ ఆదేశాల్లో స్పష్టం చేసిన నేపథ్యంలో, రూ.25 వేలు పిటిషనర్‌కు చెల్లించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. మరో రెండు వారాల్లో కూడా భూమి అప్పగించకపోతే రూ.50 వేలు పిటిషనర్‌కు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తమకు 4 ఎకరాల భూమిని రెండు వారాల్లో అప్పగించాలన్న ధర్మాసనం ఆదేశాలను అమలు చేయలేదంటూ వికారాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ సైనికుడు పి.లక్ష్మీనారాయణరెడ్డి దాఖలు చేసిన కోర్టుధిక్కరణ పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. భూ కేటాయింపు ప్రక్రియ తుది దశలో ఉందని,  ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరీందర్‌ నివేదించారు. మరో రెండు వారాల సమయం ఇస్తే భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేయడంతోపాటు భూమిని అప్పగిస్తామని పేర్కొన్నారు. విచారణను సెప్టెంబర్‌ 15కు వాయిదా వేసింది.   

మరిన్ని వార్తలు