ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా..ఏం చర్యలు తీసుకున్నారు? 

29 Jul, 2023 02:33 IST|Sakshi

వరదలపై వార్‌రూమ్‌ ఎందుకు ఏర్పాటు చేయలేదు? 

సోమవారం దీనిపై సమగ్ర నివేదిక అందజేయండి 

రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ‘రాష్ట్రంలో వరద కారణంగా ఇంతవరకు ఎంతమంది చనిపోయారు? డిజాస్టర్‌ చట్టం ప్రకారం ఎంతమందిని రక్షించారు? గోదావరి తీర ప్రాంత గ్రామాల రక్షణకు ఏం చర్యలు చేపట్టారు? బాధితులకు కనీస సౌకర్యాలు అందిస్తున్నారా? వరదలపై వార్‌రూమ్‌ ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎన్నికలప్పుడు ఏర్పాటు చేస్తారు కానీ.. వరదలు లాంటి అత్యవసర సమయంలో ఏర్పాటు చేయరా?..’అని ప్రశ్నించింది.

పూర్తి వివరాలతో ఓ నివేదికను సోమవారం అందజేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో వెల్లడించడం లేదని, రక్షణ చర్యలు తీసుకునేలా రాష్ట్ర సర్కారుకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ వినోద్‌కుమార్‌ ధర్మాసనం శుక్రవారం ప్రత్యేకంగా విచారణ చేపట్టింది.  

రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పడం లేదు.
‘వర్షాలు, వరదలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం హెచ్చరించింది. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో వరదల కారణంగా 19 మంది మృతి చెందారని పత్రికల్లో వస్తున్న వార్తలు తెలియజేస్తున్నాయి. వరదలు ఇంకా కొనసాగే అవకాశం ఉందని కేంద్రం మరోసారి తెలియజేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వరదల నుంచి ప్రజలను రక్షించడానికి ఏం చర్యలు తీసుకున్నారు? ఎంత మంది మరణించారు? లాంటి వివరాలను వెల్లడించడం లేదు. కడెం ప్రాజెక్టు వద్ద తీవ్ర భయానక పరిస్థితి కొనసాగుతోంది.

ప్రాజెక్టు తెగితే వందల గ్రామాలు నీట మునగడంతో పాటు లక్షల మంది నిరాశ్రయులుగా మారే అవకాశం ఉంది..’అంటూ న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్, పల్లె ప్రదీప్‌కుమార్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ‘వరద బాధితులకు తక్షణమే కనీస సౌకర్యాలు అందేలా ఏర్పాట్లు చేయాలి. కడెం ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని భద్రతా చట్ట ప్రకారం చర్యలు చేపట్టి వెంటనే రక్షించాలి. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా చూడాలి..’అని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. తదు పరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది.   

>
మరిన్ని వార్తలు