మసీదు ఎక్కడ నిర్మిస్తారు?

10 Sep, 2020 06:12 IST|Sakshi

కూల్చిన ప్రదేశంలోనా... మరో చోటా ? 

వివరణ ఇవ్వాలని సర్కారుకు హైకోర్టు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: సచివాలయం ఆవరణలో భవనాలతోపాటు కూల్చిన మసీదును తిరిగి అదే ప్రదేశంలోనే నిర్మిస్తున్నారా ? లేదా మరో చోటా? అనేది స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మసీదును యథాస్థానంలో కాకుండా మరో చోట నిర్మించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కూల్చిన జాగాలోనే నిర్మించేలా ఆదేశించాలంటూ నగరానికి చెందిన మహ్మద్‌ జాకీర్‌ హుస్సేన్‌ జావిద్, మహ్మద్‌ అఫ్జలుద్దీన్, ఖాజా ఐజాజుద్దీన్‌ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. సచివాలయం ఆవరణలో మసీదు నిర్మిస్తామని ప్రభుత్వం సింగిల్‌ జడ్జి దగ్గర హామీ ఇచ్చింది కదా? అదే అంశంపై మళ్లీ పిటిషన్‌ ఎలా దాఖలు చేస్తారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది యాసర్‌ మమూద్‌ని ధర్మాసనం ప్రశ్నించింది.

ముఖ్యమంత్రి స్వయంగా మసీదు, ఆలయం నిర్మిస్తామని పత్రికా ముఖంగా ప్రకటించారని, ఇంకా సచివాలయం నూతన భవన నిర్మాణం ప్రారంభం కాకముందే సందేహాలు ఎందుకని ప్రశ్నించింది. మసీదు నిర్మాణం చేపట్టకపోతే అప్పుడు పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చని సూచించింది. అయినా దేవున్ని ఎక్కడి నుంచైనా ప్రార్థించుకోవచ్చుకదా? ఫలానా దగ్గర మాత్రమే ప్రార్థన చేయాలని ఎక్కడుందని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే మసీదును ఎక్కడ నిర్మిస్తారన్న దానిపై ప్రభుత్వం ఇచ్చిన హామీలో స్పష్టత లేదని, కూల్చిన ప్రదేశంలోనే నిర్మించాలని మమూద్‌ నివేదించారు. మసీదు 647 గజాల విస్తీర్ణంలో ఒక మూలకు ఉండేదని, ఇప్పుడు ప్రభుత్వం మాత్రం 1,500 చదరపు అడుగులు మాత్రమే మసీదుకు కేటాయిస్తామంటోందని తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నూతన సచివాలయం నిర్మిస్తున్నారని, మసీదు నిర్మించిన భూమి వక్ఫ్‌ బోర్డు ఆస్తి అని, దాన్ని స్వాధీనం చేసుకోవాలంటే భూసేకరణ చట్టం కింద పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని మమూద్‌ వివరించారు.

వక్ఫ్‌ చట్టంతోపాటు భూసేకరణ చట్టం నిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘించిందని వివరించారు. భవిష్యత్‌ అవసరాలు దృష్టిలో పెట్టుకొని మరో వందేళ్ల వరకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సచివాలయం నిర్మించడం వ్యక్తిగత ప్రయోజనం ఎలా అవుతుందని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకోవచ్చని, ఇందుకు వక్ఫ్‌ బోర్డు అనుమతి కోరవచ్చని పేర్కొంది. ఉద్ధేశ్యపూర్వకంగా ప్రభుత్వం మసీదును కూల్చలేదని, ప్రభుత్వ ఖర్చుతో మసీదును నిర్మిస్తామని, అయితే ఎక్కడ నిర్మిస్తారనే దానిపై ప్రభుత్వం నుంచి వివరణ తీసుకొని తెలియజేస్తానని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం... వక్ఫ్‌ బోర్డుతోపాటు ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో అక్టోబరు 1లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను అక్టోబరు 8కి వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు