కరోనా రెండోదశపై తెలంగాణ హైకోర్టు సూచనలు

26 Feb, 2021 00:38 IST|Sakshi

కరోనాపై అప్రమత్తంగా ఉండాలని సర్కారుకు హైకోర్టు సూచన 

బులెటిన్‌ రోజూ విడుదల చేయండి 

సాక్షి, హైదరాబాద్‌: కరోనాపై రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు పలు సూచనలు చేసింది. కరోనా రెండోదశ ప్రమాదం పొంచి ఉందని, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి నివారణచర్యలు తీసుకోవాలని సూచించింది. మహారాష్ట్ర, కర్ణాటక వంటి పొరుగురాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, రెండోదశ నివారణకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందో తెలియజేయాలని ఆదేశించింది. కరోనా నిబంధనలు పాటించడంతోపాటు ప్రజలు ఎక్కువసంఖ్యలో గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. రేపటి నుంచి కరోనా బులెటిన్‌ రోజూ విడుదల చేయాలని, వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ విధానంపై విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కరోనా నియంత్రణ, వైద్య చికిత్సల్లో పాల్గొంటున్న వైద్యులు, ఇతర సిబ్బంది రక్షణకు చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ న్యాయవాది సమీర్‌ అహ్మద్‌ రాసిన లేఖ ఆధారంగా విచారణకు స్వీకరించిన ప్రజాహిత వ్యాజ్యంతోపాటు మరో పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. జనవరి 25 నుంచి ఈ నెల 12 వరకు 1,03,737 ఆర్‌టీపీసీఆర్, 4,83,266 ర్యాపిడ్‌ యాంటి జెన్‌ పరీక్షలు చేశామని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ నివేదించారు. జూన్‌ 3 నుంచి డిసెంబర్‌ 3 వరకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సీరో సర్వేలు జరిగాయని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వీలైనంత త్వరలో సీరో సర్వే చేయాలని, సర్వే నివేదిక ఆధారంగా సిఫారసులు వెంటనే అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 18కి వాయిదా వేసింది.    

మరిన్ని వార్తలు