జిల్లాకు రూ.లక్ష ఏం సరిపోతాయి?

30 Jul, 2020 05:45 IST|Sakshi

దివ్యాంగుల సంక్షేమానికిచ్చిన నిధులపై హైకోర్టు ప్రశ్న 

వారిలో రోగనిరోధక శక్తి పెంచేందుకు ప్రయత్నించండి 

తీసుకున్న చర్యలపై వచ్చేనెల 6లోగా నివేదిక ఇవ్వండి 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కట్టడిలో భాగంగా దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రతి జిల్లాకు రూ.లక్ష మాత్రమే కేటాయించారని, అయితే ఈ నిధులెలా సరిపోతాయని హైకోర్టు ప్రశ్నించింది. వరంగల్‌ జిల్లాలోనే 44 వేల మంది దివ్యాంగులున్నారని, అలాంటప్పుడు రూ.లక్షతో ఏం చేస్తారని నిలదీసింది. దివ్యాంగులు కరోనా బారిన పడకుండా చర్యలు తీసుకోవాలంటూ కేంద్రం జారీచేసిన ఉత్తర్వులను అమలు చేసేలా చూడాలంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది కర్నాటి గణేశ్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం మరోసారి విచారించింది.

ఈ సందర్భంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి దివ్య వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ధర్మాసనం ముందు హాజరయ్యారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రూ.3.5 కోట్ల నిధులు ఉండగా..ప్రతి జిల్లాకు రూ.5 లక్షల చొప్పున...రూ.2 కోట్లను అన్ని జిల్లాలకు విడుదల చేశామని తెలిపారు. ముగ్గురు సంక్షేమ అధికారులు కరోనా బారిన పడ్డారని, అయినా దివ్యాంగుల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. దివ్యాంగుల తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, సలహా కమిటీలతో ఇప్పటికే సమావేశం నిర్వహించామని పేర్కొన్నారు. అంగన్‌వాడీల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు.  

ఎంతమంది కరోనాబారిన పడ్డారు ? 
‘‘ప్రతి జిల్లాలో ఎంతమంది దివ్యాంగులున్నారు? వారిలో కరోనాబారిన పడ్డవారెందరు ? వీరిలో చనిపోయిన వారు ఎవరైనా ఉన్నారా? సహజంగా దివ్యాంగుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందా? వారిలో రోగనిరోధక శక్తి పెంచేలా ఏం చర్యలు తీసుకుంటున్నారు ?’’తదితర వివరాలను ఆగస్టు 6లోగా సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశిస్తూ విచారణను వచ్చేనెల 6కు వాయిదా వేసింది.   

మరిన్ని వార్తలు