‘ఇద్దరు పిల్లల’ నిబంధన ఎందుకు?

13 Nov, 2020 08:58 IST|Sakshi

వివరణ ఇవ్వాలని సర్కారుకు హైకోర్టు ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఇద్దరు పిల్లలకన్నా ఎక్కువ సంతానం ఉన్నా పోటీ చేసేలా ఇటీవల చట్ట సవరణ చేశారని, అయితే గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో పోటీ చేయాలంటే మాత్రం ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధన ఎందుకని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్‌గా పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ ఉన్న వారు అనర్హులంటూ ఉన్న సెక్షన్‌ 218ని సవాల్‌ చేస్తూ శ్రీధర్‌బాబు రవి, మహ్మద్‌ తాహెర్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది.

ఇద్దరు పిల్లలకన్నా ఎక్కువ ఉన్నవారు కూడా మున్సిపాలిటీల్లో పోటీ చేసేలా ప్రభుత్వం ఇటీవల మున్సిపల్‌ చట్టానికి సవరణ చేసిందని, అయితే జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రం పోటీ చేయడానికి వీల్లేదన్న నిబంధన అలాగే ఉందని, ఇందుకు సరైన కారణాలను కూడా పేర్కొనలేదని పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంపై రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేస్తామని ఏజీ అభ్యర్థించారు. అయితే ఈ రెండు వారాల్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ అయితే ఈ పిటిషన్‌ వేసి ప్రయోజనం ఉండదని రవిచందర్‌ నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం, ఈ వ్యవహారంపై ఈనెల 17లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఏజీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.  ( చదవండి: డిసెంబర్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు? )

మరిన్ని వార్తలు