ప్రాణాలకన్నా  ఎన్నికలు ముఖ్యమా? 

30 Apr, 2021 02:02 IST|Sakshi

కరోనా విరుచుకుపడుతున్నా పట్టదా?: హైకోర్టు

సెకండ్‌ వేవ్‌ ఫిబ్రవరిలోనే మొదలైతే ఏప్రిల్‌లో ఎలక్షన్‌ నోటిఫికేషనా?

 ఎస్‌ఈసీపై హైకోర్టు ప్రశ్నల వర్షం

బదులివ్వలేకపోయిన ఎస్‌ఈసీ కార్యదర్శి అశోక్‌కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు వేలల్లో పెరుగుతున్న వేళ ప్రజల ప్రాణాలకన్నా మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించడం ముఖ్యమా అని హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిం చింది. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతో సంబంధం లేకుండా ఎస్‌ఈసీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాల్సిందని, రాజ్యాంగబద్ధమైన సంస్థ ఇంత నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం ఏమిటంటూ మండిపడింది. ఎన్నికల ప్రాంతాల్లో ఎవరైనా కరోనాతో మరణిస్తే అందుకు ఎవరిది బాధ్యతని నిలదీసింది. ‘ప్రపంచమంతా కరోనా సునామీలా విరుచుకుపడుతున్నా ఎస్‌ఈసీ అధి కారులకు పట్టదా? వారు భూమ్మీదే ఉన్నారా? మరేదైనా గ్రహంపై ఉన్నారా? ఇప్పుడు ఎన్నికలు పెట్టకపోతే ఆకాశం కూలిపోతుందా? భూమి బద్దలవుతుందా?’ ’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లి, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ఎస్‌ఈసీ దాఖలు చేసిన అఫిడవిట్‌పై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ కార్యదర్శి అశోక్‌కుమార్‌ ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. 

రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినందుకే...
రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు నిర్వహించాలా వద్దా అన్న అంశంపై పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశామని, రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేశాకే నోటిఫికేషన్‌ ఇచ్చామని అశోక్‌కుమార్‌ వివరించారు. ఎన్నికల విధుల్లో ఎందరు అధికారులు పాల్గొంటున్నారని ధర్మాసనం ప్రశ్నించగా 7,695 ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వాధికారులు, 2,557 మంది పోలీసులు పాల్గొంటున్నారని వివరించారు. వారిలో ఎందరు కరోనా బారినపడ్డారని ధర్మాసనం ప్రశ్నించగా శుక్రవారం ఎన్నికల సామ్రగ్రి తీసుకునేందుకు సిబ్బంది రావాల్సి ఉన్నందున అప్పుడు తెలిసే అవకాశం ఉందని అశోక్కుమార్‌ బదులిచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఏడు మున్సిపాలిటీల్లోని ఓటర్లతోపాటు సిబ్బంది, పోలీసుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని మండిపడింది.

పోలీసులు, ఇతర అధికారులను ఎన్నికల విధులకు కేటాయించడం వల్ల వారిపై ఒత్తిడి పెంచుతున్నారని వ్యాఖ్యానించింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక కోర్టుల జోక్యానికి వీల్లేదని, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు ఆపాలంటూ ఇచ్చిన వినతిపత్రంపై తగిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీని సింగిల్‌ జడ్జి ఈ నెల 19న ఆదేశించిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. ఈ నెల 20 నుంచి ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ పెట్టినా ఎస్‌ఈసీ తగిన చర్యలు తీసుకోలేదంటూ అసహనం వ్యక్తం చేసింది. మున్సిపల్‌ చట్టంలోని సెక్షన్‌ 195 ప్రకారం అంటువ్యాధులు ప్రబలినప్పుడు ఎన్నికలను వాయిదా వేయవచ్చని, రాష్ట్రంలో పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ఎస్‌ఈసీకి కనిపించట్లేదా? అని ప్రశ్నించింది.

కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారు?
రాష్ట్రంలో కరోనా కేసులు అనూహ్యంగా తగ్గుతున్నాయని, దీని వెనుకున్న మర్మం ఏమిటని ధర్మాసనం ఏజీని ప్రశ్నించింది. పరీక్షలను ఉద్దేశపూర్వకంగానే మూడు రోజుల నుంచి తగ్గించారని, దీంతోనే కేసుల సంఖ్య తగ్గుతోందని అభిప్రాయపడింది. 26న 92 వేల పరీక్షలు చేస్తే 10,122 కేసులు వచ్చాయని, 27న 82 వేల పరీక్షలు చేస్తే 8 వేల కేసులు వచ్చాయని, 28న 80 వేల పరీక్షలు చేస్తే 7,994 కేసులు వచ్చాయని పేర్కొంది. పరీక్షలు తగ్గితే కేసులూ తగ్గుతాయని, కేసులు తగ్గుతున్నాయి కాబట్టి ఎన్నికలు నిర్వహించుకోవచ్చని మభ్యపెట్టేందుకే పరీక్షలు తగ్గించారంటూ మండిపడింది.

క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంచనా వేయరా ?
‘క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయరా? ప్రజలు కరోనాతో యుద్ధం చేస్తున్నా కనిపించట్లేదా? ప్రపంచమంతా కరోనా సెకండ్‌ వేవ్‌ ఫిబ్రవరిలోనే ప్రారంభమైనా ఏప్రిల్‌లో నోటిఫికేషన్‌ ఎలా ఇస్తారు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించకపోతే వచ్చే ప్రమాదం ఏమిటి? ఎనిమిదేళ్ల క్రితం జీహెచ్‌ఎంసీలో ఎన్నికలు నిర్వహించకుండా స్పెషల్‌ ఆఫీసర్‌తో ఏడాదిన్నర పాలన కొనసాగించారు? అదే తరహాలో కరోనా కేసులు తగ్గే వరకూ స్పెషల్‌ ఆఫీసర్‌ను నియమిస్తే వచ్చే ప్రమాదం ఏమిటి? కొన్ని మున్సిపాలిటీల్లో జూన్‌ వరకు, మరికొన్నింటిలో జూలై వరకు ఎన్నికలు నిర్వహించేందుకు సమయం ఉంది.

కనీసం అప్పటి వరకు కూడా ఆగకుండా ఆగమేఘాలపై ఎన్నికలు నిర్వహించాలన్న ఆతృత ఎందుకు? స్థానిక పరిస్థితులను పట్టించుకోకుండా గడువులోగా ఎన్నికలు నిర్వహించాలన్న నిబంధనలను గుడ్డిగా అనుసరించాలా? ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలను వాయిదా వేసే అవకాశం ఉన్నా ఎందుకు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు? వారంపాటు ర్యాలీలు, సభలకు ఎందుకు అనుమతించారు? ప్రచార సమయం కుదింపును ఎందుకు పట్టించుకోలేదు?’ అంటూ ఎస్‌ఈసీ కార్యదర్శికి ధర్మాసనం శరపరంపరగా ప్రశ్నలు సంధించింది. ఇందుకు సమాధానం ఇవ్వలేక అశోక్‌కుమార్‌ మౌనంగా ఉండిపోయారు. ఎన్నికల నిర్వహణకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని, గెలిచిన అభ్యర్థులతోపాటు ఇద్దరు మాత్రమే వచ్చి ఎన్నికల అధికారి దగ్గర అధికారిక పత్రాలను తీసుకోవాలని, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని ఆదేశించామన్నారు.

30 తర్వాత ఏం చర్యలు తీసుకుంటారు?
రాత్రి కర్ఫ్యూ అమలుపై ఇచ్చిన ఉత్తర్వులు శుక్రవారం (30వ తేదీ)తో ముగుస్తాయని, ఆ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోనున్నారో తెలియజేయాలని ధర్మాసనం అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ను ఆదేశించింది. తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడానని, శుక్రవారం పరిస్థితిపై సమీక్షించాక తగిన నిర్ణయం తీసుకుంటామన్నారని ఆయన తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ చివరి నిమిషం వరకు ఆగడం ఎందుకని, ముందే నిర్ణయం తీసుకోవచ్చు కదా అని ప్రశ్నించింది. ఎన్నికల ప్రాంతాల్లో 30 నుంచి 3వ తేదీ వరకు మద్యం అమ్మకాలను నిలిపివేసే దిశగా నిర్ణయం తీసుకోవాలని, అప్పుడే పరిస్థితులు అదుపులో ఉంటాయని సూచించింది. 30వ తేదీ తర్వాత తీసుకోనున్న చర్యలపై ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేయాలని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

ఎస్‌ఈసీ తీరు అలా ఉంది...
‘యుద్ధం చేయాల్సిన అవసరం లేకున్నా సైన్యాధికారి ఆదేశిస్తే సైనికులు చావుకు ఎదురెళ్లాల్సిందే. అలా 600 మంది సైనికులు సైన్యాధ్యక్షుని ఆదేశాలను కాదనలేక వెళ్లి మృత్యువాతపడ్డారు. ఇప్పుడు ఎస్‌ఈసీ తీరు అలాగే ఉంది. కరోనా విజృంభిస్తూ ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా సిబ్బందిని, పోలీసులను విధులకు హాజరుకావాలని ఆదేశిస్తోంది. ప్రమాదం అని తెలిసినా వారు ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించాల్సిందే’ అంటూ ఓ బ్రిటిష్‌ రచయిత రాసిన 600 సోల్జర్స్‌ డెత్‌ వ్యాలీ కవితను జస్టిస్‌ హిమాకోహ్లి ప్రస్తావించారు. 

>
మరిన్ని వార్తలు