సీఎస్‌ చదివాక సంతకం చేయాలి కదా?

6 Aug, 2021 07:51 IST|Sakshi

హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు 

ప్రభుత్వ ఉద్దేశం ఒకటి .. జీవోలో ఉంది మరొకటి 

ఆ రూ. 58 కోట్లు కోర్టు ధిక్కరణ కేసుల కోసమే అన్నట్టుంది 

జీవో రూపొందించే ముందు న్యాయ విభాగం పరిశీలించదా? 

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై నమోదైన కోర్టు ధిక్కరణ కేసుల్లో హాజరైన న్యాయవాదులకు చెల్లించేందుకు రూ.58 కోట్లు కేటాయిస్తున్నట్లుగా జీవో 208లో పేర్కొన్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ రూ.58 కోట్లు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేసిన నిర్వాసితులకు చెల్లించేందుకేనన్న ప్రభుత్వ ఉద్దేశం బాగుందని, కానీ జీవోలో మాత్రం న్యాయవాదులకు ఇచ్చేందుకే అన్నట్లుగా ఉందని స్పష్టం చేసింది. జీవో రూపొందించే ముందు న్యాయ విభాగం క్షుణ్ణంగా పరిశీలించదా ? జీవోలో ఉన్న అంశాలను పూర్తిగా చదివిన తర్వాతే సీఎస్‌ సంతకం చేయాలికదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ నిధుల విడుదలను ఆపేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ గురువారం ధర్మాసనాన్ని అభ్యర్థించారు.  

పిటిషనర్‌ తప్పుడు సమాచారం ఇచ్చారు 
భూసేకరణకు సంబంధించి చెల్లించాల్సిన పరిహారం నిర్ణీత సమయంలో చెల్లించలేకపోయామని, ఈ నేపథ్యంలోనే కోర్టు ధిక్కరణ కేసులు దాఖలయ్యాయని ఏజీ తెలిపారు. వారికి డబ్బు చెల్లించేందుకే రూ.58 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేశారని నివేదించారు. నిధుల విడుదల ఆపాలంటూ పిల్‌ దాఖలు చేసిన పిటిషనర్‌.. ధర్మాసనానికి తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపారు. బుధవారం నాటి విచారణ సందర్భంగా వాస్తవాలను ధర్మాసనం ముందుంచలేక పోయామని వివరించారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో నిర్వాసితులకు డబ్బులు చెల్లించడం ఆలస్యమవుతుంది కాబట్టి, తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరారు. అయితే ఈ నెల 9న ఈ వ్యాజ్యాన్ని విచారిస్తామని కోర్టు తెలిపింది.

మరిన్ని వార్తలు