హఫీజ్‌పేట భూవివాదం: హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

31 Mar, 2021 02:12 IST|Sakshi

హఫీజ్‌పేట భూములు వక్ఫ్‌బోర్డువంటూ ఇచ్చిన నోటిఫికేషన్‌ చెల్లదు: హైకోర్టు

 ప్రభుత్వ భూమిగా ‘రెవెన్యూ’లో పేర్కొనడం చట్టవిరుద్ధం

ఈ భూమి కోసమే ప్రవీణ్‌కుమార్‌ కిడ్నాప్‌ యత్నం

హైదరాబాద్‌: హఫీజ్‌పేట్‌లోని సర్వే నంబర్‌ 80లోని భూమి విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులకు మధ్య గత కొన్నేళ్లుగా నడుస్తున్న వివాదానికి హైకోర్టు ముగి ంపు పలికింది. ఈ సర్వే నంబర్‌లోని 50 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులదేనని తేల్చిచెప్పింది. ఈ భూమిని వక్ఫ్‌బోర్డుకు చెందినదిగా పేర్కొంటూ చేసిన తీర్మానాన్ని కొట్టేసింది. అలాగే రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా పేర్కొనడాన్ని తప్పుబడుతూ ఎంట్రీలను రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఎస్‌.రామచందర్‌రావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది.

తమ భూములను వక్ఫ్‌బోర్డు భూములుగా పేర్కొంటూ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కటికనేని ప్రవీణ్‌కుమార్‌తో పాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. ‘గిఫ్ట్‌ సెటిల్‌మెంట్‌ డీడ్‌ ఆధారంగా పిటిషనర్ల పేర్లను రెవెన్యూ రికార్డుల్లో చేర్చండి. అలాగే పిటిషనర్ల భూమి పొజిషన్‌ విషయంలో ప్రభుత్వం, వక్ఫ్‌బోర్డు జోక్యం చేసుకోరాదు. పిటిషనర్లకు ఒక్కొక్కరికి రూ.50 వేలు ప్రభుత్వం, వక్ఫ్‌బోర్డు జరిమానాగా చెల్లించాలి’అని తీర్పులో పేర్కొంది.

ఈ భూమి కోసమే కిడ్నాప్‌ యత్నం
హఫీజ్‌పేటలోని ఈ భూమిని తమ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్న కుట్రలో భాగంగానే ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్‌ మరికొందరితో కలసి కె.ప్రవీణ్‌కుమార్, ఆయన సోదరులను కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారు. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కిడ్నాపర్లు పరారయ్యారు. తర్వాత అఖిలప్రియతో పాటు కిడ్నాప్‌ కుట్రలో పాల్గొన్న మరికొందరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అఖిలప్రియ తదితరులకు న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేయగా.. భార్గవ్‌రామ్‌ తదితరులు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్‌ పొందిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు