Telangana VROs: వీఆర్వోల అంశంపై తెలంగాణ సర్కార్‌కు షాకిచ్చిన హైకోర్టు

9 Aug, 2022 00:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)ను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు(విలీనం) ప్రక్రియ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 121 అమలుపై హైకోర్టు స్టే విధించింది. జీవో చట్టానికి వ్యతిరేకంగా ఉందని భావిస్తూ.. తదుపరి ఉత్తర్వులు వెల్లడించే వరకు నిలిపివేత ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.  జీవోలోని మూడో పేరాలోని విషయాలు యాక్ట్‌4 (1)కి వ్యతిరేకంగా ఉన్నాయని, అందుకే జీవో అమ లును నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటివరకు వేరే శాఖల్లో బాధ్యతలు చేపట్టని ఉద్యోగులను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని సర్కార్‌కు ఆదేశాలు జారీ చేసింది.

వీఆర్వోలుగా పనిచేస్తున్న వారిని ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు(విలీనం) చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతిస్తూ జీవో నంబర్‌ 121ను విడుదల చేసిన విషయం తెలిసిందే. గత నెల విడుదల చేసిన ఈ జీవో చట్టవిరుద్ధమని, సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించినట్లేనని, వివక్షపూరితమని పేర్కొంటూ.. తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం, నల్లగొండ జిల్లా మహమూదాపురం వీఆర్వో పగిళ్ల వీరయ్య హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. రెవెన్యూశాఖలో ఖాళీగా ఉన్న సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో తమను సర్దుబాటు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

దీనిపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభు త్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. చట్ట ప్రకారమే వీఆర్వోలను ఇతర శాఖల్లోకి సర్ధుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఐదు వేల మంది వీఆర్వోల్లో 56 మందే వేరే శాఖల్లో చేరలేదని, 98.9 శాతం ఉద్యోగులు చేరిపోయారని వెల్లడించారు. ఉద్యోగం నుంచి ఎవరినీ తొలగించలేదని, ప్రభుత్వానికి ఏ శాఖలో అవసరమో అక్కడ సర్దుబాటు చేశామని.. దీంతో వీఆర్వోలకు నష్టం జరగడం లేదన్నారు. పిటిషనర్‌ తరఫున అడ్వొకేట్‌ పీవీ కృష్ణయ్య వాదనలు వినిపించారు.

వీఆర్వోల బదిలీలతో సంబంధం లేకుండానే జీవో వెలువడిందన్నారు. వీఆర్వో వ్యవస్థ రద్దుకు చట్టం తెచి్చన ప్రభుత్వం అందుకు అవసరమైన నిబంధనల్ని రూపొందించలేదని నివే దించారు. రెవెన్యూ శాఖలోనే వీఆర్వోలు కొనసాగాలని కోరుకుంటున్నారని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. విధివిధానాల నిబంధనలను రూపొందించకుండా జీవో ఎలా ఇస్తారని ప్రశ్నించింది.  ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదే శించింది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. 

ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో పంచపాండవులు మిగిలారు: జీవన్‌ రెడ్డి

మరిన్ని వార్తలు