ఎమ్మెల్యే పౌరసత్వంపై వీడని సస్పెన్స్

16 Feb, 2021 16:18 IST|Sakshi

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదం

తుది వాదనలకు సిద్ధంగా ఉండాలన్న హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌ : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై సస్పెన్స్ కొనసాగుతోంది. గతకొంత కాలంగా సాగుతున్న ఈ వివాదంపై మంగళవారం హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నారని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అఫిడవిట్‌లో తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్ర రావు కోర్టుకు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు గడువుకోసం కోర్టును కోరారు. కేంద్రం మాత్రం వారంలో విచారణ పూర్తిచేయాలని కోరుతోంది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేస్తు.. సిద్ధంగా ఉండాలని హైకోర్టు ఇరుపక్షాలకు సూచించింది. జర్మనీ పౌరసత్వం కలిగి పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలని పిటిషనర్‌ ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది రవికిరణ్ కోర్టుకు తెలిపారు. చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే అమలుచేయాలని విజ్ఞప్తి చేశారు.

రమేష్ పౌరసత్వం వివాదంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా స్పందించింది. చెన్నమనేని పౌరసత్వంపై కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని, ప్రస్తుతం ఆయన దేశంలోని ఉన్నాడని, రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలు అందిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వలన శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలుగటంలేదన్నారు. కాగా 2017లో కేంద్ర హోంశాఖ చేపట్టిన మొదటి విచారణలో రమేష్ భారత పౌరుడు కారని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మళ్లీ ఓ సారి సమీక్షించాలని రమేష్ అభ్యర్తించగా రెండోసారి కేంద్ర హోంశాఖ పౌరసత్వం పై సమీక్షించి.. భారత పౌరుడు కాదని తేల్చింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలను సవాలు చేస్తూ రమేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. సహజ న్యాయ సూత్రాలు పాటించలేదని కోర్టును అభ్యర్థించాడు.

దీంతో జూలై 23. 2019 తేదిన గతంలో కేంద్ర హోం శాఖ ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేస్తూ త్రిమెన్ ఇచ్చిన నివేదికను నుంచి పున: పరిశీలించాలని, పౌరసత్వం లో 10(3) నిబంధనను కూడా చట్టప్రకారం పరిశీలించాల్సిందిగా తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. 12 వారాలలో తేల్చాలని కేంద్రహోం శాఖకు తిరిగి అదేశించింది. అక్టోబర్ 31, 2019 న ఢిల్లీలోని కేంద్ర హోం శాఖ బోర్డర్ మేనేజ్ మెంట్ సెక్రటరీ నార్త్ బ్లాక్లోని ఓ గది లో ఇరుపక్షాలను విచారించారు. హైకోర్టు ఇచ్చిన 12 వారాల గడువు అనంతరం మళ్లీ కేంద్ర హోం శాఖ చెన్నమనేని భారతదేశ పౌరుడు కాదని తేల్చి చెప్పింది. కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మళ్ళీ చెన్నమనేని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై న్యాయస్థానం విచారిస్తోంది. మరో రెండు వారాల్లో ఇరుపక్షాలు దాఖలు చేసిన కౌంటర్‌ అనంతరం తిరిగి విచారించనుంది. తుది వాదనలకు అన్ని పార్టీలు సిద్ధంగా ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్ట్ ఎలాంటి ఆదేశాలు జారీచేస్తుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు