Lockdown విధిస్తారా.. లేదంటే: టీఎస్‌ హైకోర్టు

11 May, 2021 21:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు తగ్గిండంపై ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలు బేఖాతరు చేస్తే కోర్టు ధిక్కారణ నోటీసులు ఇస్తామని హెచ్చరించింది. అదే విధంగా.. సరిహద్దుల్లో అంబులెన్స్‌లను ఎందుకు అడ్డుకుంటున్నారని కేసీఆర్‌ సర్కారును ప్రశ్నించింది. ఇక పాతబస్తీలో కోవిడ్‌ నిబంధనలు పాటించడం లేదన్న న్యాయస్థానం.. లాక్‌డౌన్‌ విధిస్తారా లేదా నిబంధనలు కఠినతరం చేస్తారో చెప్పండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

అదే విధంగా.. ‘‘మేం ఆదేశాలు ఇచ్చిన రోజు ప్రెస్‌మీట్‌ పెట్టి... లాక్‌డౌన్‌ అవసరం లేదని సీఎస్‌ ఎలా చెప్తారు. రంజాన్‌ పండుగ అయ్యాక లాక్‌డౌన్‌ పెట్టాలనుకుంటున్నారా?’’  అంటూ మండిపడింది. ఇక ఇందుకు స్పందించిన అడ్వకేట్‌ జనరల్‌.. మధ్యాహ్నం కేబినెట్‌ భేటీ ఉందని, సమావేశం అనంతరం లాక్‌డౌన్‌, కర్ఫ్యూపై వివరాలు సమర్పిస్తామని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితులపై పూర్తి వివరాలు ఇవ్వాలన్న న్యాయస్థానం విచారణను మధ్యాహ్నం 2:30కు వాయిదా వేసింది. కాగా తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో... లాక్‌డౌన్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. నేడు మంత్రివర్గ సమావేశం అనంతరం సాయంత్రానికల్లా ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం:

  • అంతర్ రాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్స్ ఎందుకు నిలిపివేస్తున్నారు?
  • హైదరాబాద్ అనేది మెడికల్ హబ్. ఆరోగ్యం కోసం ఎంతో మంది ఇక్కడికి వస్తుంటారు. ప్రజలను ఇక్కడికి రావొద్దు అని చెప్పడానికి మీకు ఏం అధికారం ఉంది?
  • హాస్పిటల్‌లో వైద్యం కోసం వచ్చే వారిని మీరెలా అడ్డుకుంటారు?
  • కేర్, అపోలో ఆస్పత్రిలో అంతర్ జాతీయ పేషెంట్లు ఉంటారు వాళ్ళను కూడా అడ్డుకుంటారా?
  • దేశ రాజధాని ఢిల్లీకి కూడా ఎంతో మంది పేషంట్లు ఎన్నో రాష్ట్రాల నుండి వస్తుంటారు . అలా అని ఢిల్లీలో అంబులెన్స్ లను ఆపేస్తున్నారా?
  • ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటే అంబులెన్స్లను ఆపడం ఏంటి?
  • గతంలో మేం చెప్పినట్టు మొబైల్ టెస్ట్లను కూడా మీరు నిర్వహించలేక పోయారు కానీ ఇప్పుడేమో అంబులెన్స్‌లను ఆపేస్తున్నారు. ఎందుకు?

చదవండి: కరోనా: అంతా ఓకే ఆనుకోవద్దు

>
మరిన్ని వార్తలు