పేదోడి ఇంట పచ్చడి మెతుకులూ కష్టమే

24 May, 2022 12:47 IST|Sakshi

ఖమ్మం (మధిర) : గ్యాస్, నిత్యావసరాలతో పాటు కూరగాయల ధరలు పెరుగుతుండగా... పచ్చడితోనైనా కడుపు నింపుకుందామని భావించే పేదలకు అది కూడా భారంగా మారుతోంది. దిగుబడి తగ్గడంతో పెరిగిన మామిడి కాయల ధరలకు తోడు, పచ్చడి తయారీకి ఉపయోగించే ఇతర దినుసుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్న తరుణాన ఈ ఏడాది పలువురు పచ్చడిపైనే ఆశలు వదిలేసుకున్నారు. దీంతో పేదలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఏటా పెట్టే మామిడికాయ పచ్చడి సువాసన ఈసారి అక్కడక్కడే వస్తోంది. 

వేసవి వచ్చిందంటే...
వేసవికాలం వస్తుందంటే అన్ని వర్గాల ప్రజలు మొదటగా మామిడికాయ పచ్చడిపైనే దృష్టి సారి స్తారు. ఇందుకోసం మేలు రకాల కాయలను ఎంచుకుని పచ్చడి పెట్టడం ఆనవాయితీ. ఇళ్లలో ఉపయోగానికే కాకుండా దూరప్రాంతాల్లో ఉంటున్న బంధువులు, కుటుంబీకులకు పంపించేందుకు గాను అవసరమైన పచ్చడి కోసం ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ ఈసారి మామిడి పూత పెద్దగా రాకపోగా, వచ్చిన పూత కూడా తెగుళ్ల బెడదతో నిలవలేదు. దీంతో మామిడికాయల ధరలు అమాంతకం పైకి వెళ్లాయి. ఫలితంగా పచ్చడి కోసం కాయల కొనుగోలుకు వస్తున్న వారు ధరలు చూసి నిరాశగా వెనుతిరుగుతున్నారు.

​​​​​​​

మటన్‌ ముక్కలే...
చాలా మంది ఇళ్లలో మామిడికాయ పచ్చడి ఇష్టంగా తింటారు. దీనికి తోడు ఉదయం ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం వెళ్లే వారి క్యారేజీల్లో పచ్చడి తప్పక కనిపిస్తుంది. కానీ ఈసారి కాయల కొరత, పెరిగిన ధరలతో పచ్చడి పెట్టేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించకపోగా, కొందరు పెడుతున్నా యాభై కాయలకు బదులు పది, ఇరవై కాయలతో సరిపుచ్చుకుంటున్నారు. దీంతో బంధువులకు పంపించడం మాటేమో కానీ ఇంట్లో పెట్టిన పచ్చడిని జాగ్రత్తగా కాపాడుకుంటూ తినాల్సిందేనని చెబుతున్నారు.


ఏపీ నుంచి దిగుమతి
సాధారణంగా పచ్చడి తయారీకి చిన్నరసాలు, పెద్దరసాలు, జలాలు, తెల్లగులాబీ, నాటు తదితర రకాలను వినియోగిస్తారు. అయితే, జిల్లాలో 2018 – 19లో 1.20లక్షల ఎకరాలు, 2019 – 20లో 70వేలు, 2020 – 21లో 31,994, 2021 – 22లో 33,861 ఎకరాల్లో మామిడిసాగు విస్తీర్ణం ఉంది. చీడపీడలు ఆశించడం, అధిక వర్షాలు, గిట్టుబాటు ధర లేకపోవడం వంటి కారణాలతో చాలా మంది రైతులు తోటలను తొలగించారు. అలాగే, ఉన్న తోటల్లోనూ ఈసారి పెద్దగా దిగుబడి లేదు. దీంతో ఆంధ్రా సరిహద్దులో ఉన్న తిరువూరు, నూజివీడు, విస్సన్నపేట, ఎ కొండూరు, చింతలపూడి తదితర ప్రాంతాలనుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. ఫలితంగా మామిడికాయలకు ధర పెరిగిందని చెబుతున్నారు.

ఆ జోలికే వెళ్లలేదు...
ప్రతిరోజూ పనులకు వెళ్తుంటాం. ఉదయం వంట చేసుకోలేనందున ఎండాకాలంలో మామిడి కాయ పచ్చడి పెట్టి ఏడాదంతా వాడుకుంటాం. కానీ ఈసారి మామిడికాయలే కాదు నూనె ధర కూడా పెరిగింది. దీంతో ఈ ఏడాది పచ్చడి జోలికే వెళ్లలేదు. యాభై కాయలకు బదులు పది కాయలతో పచ్చడి పెట్టాలన్నా ధైర్యం చేయలేకపోయాం.
– ఆదిలక్ష్మి, లడకబజార్, మధిర

ఖర్చు ఇలా...
మామిడి పచ్చడికి ఎక్కువగా ఉపయోగించే జలాల రకం కాయ ఒక్కొక్కటి రూ.40, చిన్నరసం రూ.30చొప్పున విక్రయిస్తున్నారు. దీనికి తోడు మిర్చి రకానికి అనుగుణంగా కేజీకి 250కు పైగా పలుకుతుండగా నూనె కేజీ ధర రూ.190 వరకు ఉంది. అలాగే, మామిడికాయ ముక్కలు కొట్టించడం, కారం పట్టించే ఖర్చు... ఎల్లిపాయలు, మెంతులు, ఉప్పు ఇలా దినుసుల ధరలు కూడా పెరి గాయి. ఫలితంగా ఈసారి పచ్చడి పెట్టడం భారంగా మారిందని సామాన్యులు వాపోతున్నారు.

మరిన్ని వార్తలు