తైవాన్‌–కనెక్ట్‌ తెలంగాణ: పెట్టుబడులకు రెడ్‌ కార్పెట్‌

1 Oct, 2021 01:53 IST|Sakshi

రాష్ట్రంలో తైవాన్‌ పెట్టుబడులకు అధిక ప్రాధాన్యత

ఎలక్ట్రానిక్స్‌ రంగ దిగ్గజాలను రాష్ట్రానికి ఆహ్వానిస్తాం

‘తైవాన్‌–కనెక్ట్‌ తెలంగాణ’ సమావేశంలో మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎలక్ట్రానిక్స్‌ తయారీ, పరిశోధన అభివృద్ధి రంగాల్లో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజాలను తెలంగాణలోకి ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. ఇప్పటికే తైవాన్‌కు చెందిన ప్రముఖ కంపెనీలు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, భవిష్యత్తులో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్‌ వెహికల్స్, ఎనర్జీ స్టోరేజ్‌ సొల్యూషన్స్‌ వంటి రంగాలకు మరింత ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్, అనుబంధ రంగాల్లో తైవాన్‌తో బలమైన భాగస్వామ్యం కుదుర్చుకుంటామని కేటీఆర్‌ ప్రకటించారు. ఇన్వెస్ట్‌ ఇండియా ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘తైవాన్‌–కనెక్ట్‌ తెలంగాణ స్టేట్‌’ వర్చువల్‌ సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. తెలంగాణలో తైవాన్‌  పెట్టుబడులకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తామని, తైవాన్‌ తెలంగాణ నడుమ మరింత వ్యాపార, వాణిజ్య అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్న పెట్టు బడి అవకాశాలపై కంపెనీలకు అవగాహన కల్పిం చేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు కేటీ ఆర్‌ ప్రకటించారు. తైవాన్‌ తెలంగాణ నడుమ ఇప్పటికే పటిష్టమైన భాగస్వామ్యం ఉందని, ఆ దేశ పెట్టుబడుల కోసం గతంలో తాను తైవాన్‌లో పర్యటించిన విషయాన్ని కేటీఆర్‌ గుర్తుచేశారు.

స్టార్టప్‌ బంధంలో ఏకైక నగరం..
తైవాన్‌కు చెందిన తైవాన్‌ కంప్యూటర్‌ అసోసి యేషన్‌ (టీసీఏ)తో సాంకేతిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, తైవాన్‌తో స్టార్టప్‌ బంధం ఏర్పరచుకున్న ఏకైక నగరం హైదరాబాదేనని కేటీఆర్‌ వెల్లడించారు. తైవాన్‌ పారిశ్రామిక సంస్కృతి నుంచి ప్రపంచం అనేక విషయాలు నేర్చుకోవాల్సి ఉందని, ఈ దిశగా అక్కడి పారిశ్రామిక వర్గాలతో భాగస్వామ్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 2020 నుంచి కరోనా సంక్షోభం విసిరిన సవాళ్లతో దెబ్బతిన్న వ్యాపార, వాణిజ్య రంగాలు మెరుగవుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యేలా పారిశ్రామిక అభివృద్ది, పెట్టుబడుల ఆకర్షణ మరింత వేగంగా కొనసాగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ఐదేళ్లలో తెలంగాణ 32 బిలియన్ల పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు జీడీపీ, తలసరి ఆదాయం, సులభతర వాణిజ్య విధానంలో అగ్రస్థానంలో నిలుస్తోందని కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణతో కలసి పనిచేయడం తమకు అత్యంత ఉత్సాహాన్ని ఇస్తోందని ఇన్వెస్ట్‌ ఇండియా సీఈఓ దీపక్‌ బగ్లా అన్నారు. తైవాన్‌కు తెలంగాణ రాష్ట్రం సహజ భాగస్వామి అని, రాబోయే రోజుల్లో ఎలక్ట్రానిక్స్, అనుబంధ రంగాల్లో ఇరు ప్రాంతాల నడుమ భాగస్వామ్యం మరింత పెంచుతామన్నారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, ఎలక్ట్రానిక్స్‌ విభాగం డైరెక్టర్‌ సుజయ్‌ కారంపూరి పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు