మూడ్రోజులు మంటలే..

31 Mar, 2022 04:03 IST|Sakshi

రాష్ట్రంలో పలుచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: వేసవి ముదరకముందే ఎండలతో తెలంగాణ మండిపోతోంది. సాధారణం కంటే 2,3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌ బుధవారం భానుడి భగభగలతో అల్లాడిపోయింది. సాధారణం కంటే 3.5 డిగ్రీలు అధికంగా 40.4 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్‌లో 42.3డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

నల్లగొండ, నిజామాబాద్, రామగుండంలలో 41డిగ్రీలు, మహబూబ్‌నగర్, మెదక్‌లలో 40 డిగ్రీలకు పైగా నమోదయ్యింది. కాగా వచ్చే మూడు రోజులు ఉత్తర తెలంగాణా జిల్లాలతో పాటు నల్లగొండ, సూర్యాపేట, నిజామాబాద్‌ తదితర జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా 2 నుండి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని ఉత్తర, వాయువ్య జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశాలున్నాయని హెచ్చరించింది. మార్చి చివరి వారంలోనే ఈ విధంగా ఎండలు దంచి కొడుతుండటంతో ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఎండల తీవ్రతను బట్టి అలర్ట్‌లు
వాతావరణ శాఖ ఎండల తీవ్రతను బట్టి ప్రజలను అప్రమత్తం చేస్తుంటుంది. సాధారణం కంటే ఆరు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైతే అత్యంత తీవ్రమైన ఎండగా గుర్తించి రెడ్‌ అలర్ట్‌ జారీ చేస్తారు. నాలుగైదు డిగ్రీల వరకు ఎక్కువగా నమోదైతే తీవ్రమైన ఎండగా గుర్తించి ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేస్తారు. సాధారణం కంటే కొద్దిగా ఎక్కువగా నమోదైతే గుర్తించి ఎల్లో (హీట్‌ వేవ్‌ వార్నింగ్‌) అలర్ట్‌ ఇస్తారు. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలున్నప్పుడు వైట్‌ అలర్ట్‌ జారీ చేస్తారు.

వడదెబ్బతో అనారోగ్యం..
అధిక ఎండలతో పలుచోట్ల కోతకు సిద్ధమైన వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధి కూలీలు ఎండలకు మాడిపోతున్నారు. కాగా బయట తిరిగేవారు, పిల్లలు, వృద్ధులు తీవ్రమైన ఎండలు, వడదెబ్బతో అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలు డయేరియా బారిన పడే ప్రమాదముంది.

వడదెబ్బ తగిలితే వాంతులు, విరోచనాలయ్యే అవకాశం ఉంది. తలనొప్పి, తల తిరగడం, నీరసం, తీవ్రమైన జ్వరం, అధికనిద్ర, మూర్ఛ, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితికి గురయ్యే ప్రమాదముందని నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీ క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి డాక్టర్‌ కిరణ్‌ మాదల చెబుతున్నారు. 

కెరమెరి@43.9 
తిర్యాణి (ఆసిఫాబాద్‌): రాష్ట్రంలో ఆదిలాబాద్‌లో అత్యధిక ఉష్ణోగ్రత (42.3) నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే.. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని కెరమెరి మండల కేంద్రంలో 43.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు సమా చారం అందింది. అదే జిల్లాలోని కౌటాల మండల కేంద్రంలో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  

తెలుపు కాటన్‌ దుస్తులు మంచిది
ఆరుబయట పనిచేసేవారు సూర్యరశ్మి నుంచి కాపాడుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. బయ ట తిరిగేవారు గొడుగు వాడాలి. తరచూ నీళ్లు, ఇతర ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. 
► తెలుపు లేదా లేత వర్ణం కలిగిన పలుచటి కాటన్‌ దుస్తులు ధరించాలి. 
► తలకు వేడి తగలకుండా టోపీ పెట్టుకోవాలి లేదా రుమాలు చుట్టుకోవాలి.
► ఇంటి వాతావరణం చల్లగా ఉంచుకోవాలి. ఫ్యాను వాడాలి. చల్లని నీటితో స్నానం చేయాలి.
► వేడి లోనికి దిగకుండా ఇంటిపై కప్పులపై వైట్‌ పెయింట్‌ వేయించాలి. కూల్‌ రూఫ్‌ టెక్నాలజీ, క్రాస్‌ వెంటిలేషన్, థర్మోకోల్‌ ఇన్సులేషన్‌ వంటివి ఎండ వేడిమిని తగ్గిస్తాయి.

పిల్లలు, వృద్ధులపై ఎక్కువ ప్రభావం
►  మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 3 గంటల మధ్య బయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పనిచేయరాదు.
►  నలుపురంగు, మందంగా ఉండే దుస్తులు ధరించరాదు.
►  బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగరాదు. వీరిపై ఎండ త్వరగా ప్రభావం చూపే అవకాశం ఉంది.
►  శరీరాన్ని డీహైడ్రేట్‌ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ మానుకుంటే మంచిది. అధిక ప్రోటీన్, ఉప్పు, కారం, నూనె ఉండే పదార్థాలను తీసుకోవద్దు.
►  ఎక్కువ ప్రకాశించే విద్యుత్‌ బల్బులను వాడకూడదు. అవి అధిక వేడిని విడుదల చేస్తాయి.
►  ఎండలో నుంచి వచ్చిన వెంటనే తేనె వంటి తీపి పదార్థాలు తీసుకోకూడదు.
► శీతల పానీయాలు, ఐస్‌ వంటివి తీసుకుంటే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.

వడదెబ్బకు గురైతే..
► వడదెబ్బ తగిలిన వారిని నీడలో, చల్లని ప్రదేశంలో ఉంచాలి. 
► మజ్జిగ, గ్లూకోజు నీరు, చిటికెడు ఉప్పు.. చెంచా చక్కెర ఒక గ్లాసులో కలుపుకొని ఇంటిలోనే తయారుచేసిన ఓఆర్‌ఎస్‌ ద్రావణం తాగితే వడదెబ్బ నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది. 
► శరీర ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది కాబట్టి సాధారణ ఉష్ణోగ్రత
వచ్చేవరకు తడి గుడ్డతో తుడుస్తూ ఉండాలి. వేడి నీటిలో ముంచిన గుడ్డతో తుడవరాదు.
► ప్రాథమిక చికిత్స అనంతరం సాధారణ స్థితికి రాకుంటే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలి.

మరిన్ని వార్తలు