రామగుండం ఎన్టీపీసీ వద్ద ఉద్రిక్తత

23 Aug, 2022 01:34 IST|Sakshi
కార్మికులను అడ్డుకుంటున్న సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది 

జ్యోతినగర్‌ (రామగుండం): పెద్దపల్లి జిల్లాలోని ఎన్టీపీసీ రామగుండం కర్మాగారం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీపీసీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు 2018 నాటి ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్‌చేస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం గేట్‌ సమావేశం నిర్వహించారు. కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంస్థ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

ఒక దశలో కార్మికులు ప్లాంట్‌ గేట్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నించగా సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో 30 మందికిపైగా కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది లాఠీచార్జి చేసి దాడిచేశారని కార్మికు లు ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  

కార్మికులను పరామర్శించిన ఎమ్మెల్యే చందర్‌ 
సీఐఎస్‌ఎఫ్‌ లాఠీచార్జిలో గాయపడిన కాంట్రాక్టు కార్మికులను ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఎన్టీపీసీ పోలీస్‌ స్టేషన్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిలకుపై లాఠీచార్జి చేయడం దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, హోంమంత్రి మహమూద్‌ ఆలీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని వెల్లడించార.

మరిన్ని వార్తలు