రోడ్డు ప్రమాదం.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ రోడ్డులో తీవ్ర ఉద్రిక్తత

23 Sep, 2023 18:23 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మార్గంలో శనివారం పోలీసులు, స్థానికుల మధ్య తోపులాట, ఘర్షణ జరిగింది.  నిత్యం ఈ రూట్‌లో యాక్సిడెంట్లు జరుగుతున్నాయంటూ రోడ్డును బ్లాక్‌ చేసి ఆందోళన చేపట్టారు వందల మంది స్థానికులు. దీంతో పోలీసుల ఎంట్రీతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది అక్కడ. 

సిద్ధాంతి గ్రామానికి చెందిన యాదయ్య అనే వ్యక్తి రోడ్డు క్రాస్ చేస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అయితే.. వీఐపీ, విమాన ప్రయాణాలు చేసేవాళ్ల వాహనాలతో ఈ రోడ్లు నిత్యం బిజీగా ఉంటాయి. ఈ క్రమంలో వాహనాలు వేగంగా రావడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళనకు దిగారు.  గాల్లో ప్రాణాలు కలుస్తున్నా పట్టించుకోవడం లేదని అధికారులను తిట్టిపోశారు.

ఈ క్రమంలో గ్రామ ప్రజలు వందల మంది.. యాదయ్య మృతదేహంతో  శంషాబాద్‌  ఎయిర్‌పోర్ట్‌ రోడ్డుపై బైఠాయించారు. ఈ ఆందోళన భారీ ట్రాఫిక్‌ జామ్‌కు కారణమైంది. శంషాబాద్‌ నుంచి గగన్‌పహాడ్‌ వరకు పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రోడ్డుపై బైఠాయించిన స్థానికులను అరెస్ట్‌ చేశారు. మరోవైపు ట్రాఫిక్‌ క్లియర్‌ చేసేందుకు ప్రయత్నించారు. అయితే.. ఇరువైపులా ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో క్లియరెన్స్‌కు చాలాసేపు పట్టింది. ఇంకోవైపు ఎయిర్‌పోర్ట్‌ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో వాహనాలను వదిలి ఎయిర్‌పోర్ట్‌కు పరుగులు పెట్టిన దృశ్యాలు కనిపించాయి.

మరిన్ని వార్తలు