ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం.. బండి Vs కేసీఆర్‌.. యాదాద్రిలో హైటెన్షన్‌

28 Oct, 2022 10:27 IST|Sakshi

సాక్షి, యాదాద్రి భువనగిరి: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన వ్యవహారం తెలంగాణలో రాజకీయ వేడి రాజేస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక వేళ ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఎపిసోడ్‌ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని టీఆర్‌ఎస్‌ ఆరోపిస్తుంది. అయితే తమకు ఆ అవసరం లేదని, మొయినాబాద్‌ ఫామ్‌హౌజ్‌ ఘటన కేసీఆర్‌ కుట్ర అని బీజేపీ వాదిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయంతో రాజకీయాలు చేస్తోందని మండిపడింది. ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంలో ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం ఆరోపణలు, విమర్శలు ఎక్కుపెట్టాయి.

తాజాగా టీఆర్‌ఎస్‌, బీజేపీ హైడ్రామా నేపథ్యంలో యాదాద్రిలో టెన్షన్‌ నెలకొంది. తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ కాసేపట్లో యాదాద్రి ఆలయానికి వెళ్లనున్నారు. భారీ కాన్వాయ్‌తో బయల్దేరారు. ఫాంహౌజ్‌ వ్యవహారంపై ప్రమాణానికి సిద్ధమని ఆయన తెలిపారు. ప్రమాణం చేయడానికి కేసీఆర్‌ రావాలని బండి సంజయ్‌ సవాల్ చేశారు.  బండి సంజయ్‌ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అయితే పోలీసులు అడ్డుకున్నా యాదాద్రి వెళ్తానని బండి సంజయ్‌ తెగేసి చెబుతున్నారు.

మరోవైపు యాదాద్రిలో టీఆర్‌ఎస్‌ నేతలు నల్ల జెండాలో భారీ ర్యాలీ చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బండి సంజయ్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ పోటాపోటీ నిరసనలతో మొత్తానికి యాదాద్రిలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి .ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు.  
చదవండి: MLAs Episode: బీజేపీ హైకమాండ్‌ ఆగ్రహం.. రంగంలోకి కేంద్ర హోం శాఖ

మరిన్ని వార్తలు