బాబోయ్‌ ఉక్కపోత! మరోవారం ఇంతేనట!!

10 Aug, 2021 08:33 IST|Sakshi

పెరిగిన విద్యుత్తు వినియోగం

సాక్షి, సిటీబ్యూరో: రుతుపవనాలకు బ్రేక్‌ పడడంతో నగరంలో మళ్లీ పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఎండ వేడిమితో ఒక్కసారిగా ఉక్కపోత పెరిగింది. రుతుపవనాలు వెస్ట్‌ బెంగాల్‌ వైపు మళ్లాయని..శీతల గాలులు సైతం ఉత్తరదిశ వైపు వీస్తున్నందున నగరంలో పగటి ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాల్లో 33 నుంచి 35 డిగ్రీల వరకు పెరిగాయని..గాలిలో తేమ శాతం 50 శాతానికంటే తక్కువగా నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న ‘సాక్షి’కి తెలిపారు.

మరో వారం రోజులపాటు నగర వాతావరణ పరిస్థితిలో పెద్దగా తేడాలుండవని..ఆ తర్వాత రుతుపవనాల దిశ మారే అవకాశం ఉందని, గాలిలో తేమ శాతం పెరగడం, ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తేలిక పాటి వర్షాలుకురిసే అవకాశాలున్నట్లు వివరించారు. కాగా నగరంలో పగటి ఉష్ణోగ్రతలు పెరగడం, ఉక్కపోత పెరగడంతో విద్యుత్‌ వినియోగం సైతం పెరిగింది. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లతో సిటీజనులు సేదదీరారు. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లినవారు ఎండవేడిమితో సతమతమయ్యారు. ఈ సీజన్‌లో జూన్‌ ఒకటి నుంచి జూలై 31 వరుస నగరంలో పలు మండలాల్లో సాధారణం కంటే 40 నుంచి 50 శాతం అధిక వర్షపాతం నమోదైన విషయం విదితమే. 

మరిన్ని వార్తలు