ఎత్తిపోతకు.. గట్టిమోతే!

13 Dec, 2020 01:20 IST|Sakshi

భారీగా విద్యుత్‌ అవసరం

4,720 మిలియన్‌ యూనిట్లు కావాలి

2,200మిలియన్‌ యూనిట్లు  కాళేశ్వరానికే అవసరం

సాక్షి, హైదరాబాద్ ‌: ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిశాయి. నీళ్లున్నాయి... యాసంగిలో పంటలకు ఢోకా లేదు. అంతవరకు బాగానే ఉంది కానీ... నీటిని ఎత్తిపోయాలి. దీనికి భారీగా విద్యుత్‌ కావాలి. రాష్ట్రంలో ప్రధాన ఎత్తిపోతల పథకాల కింద గరిష్ట ఆయకట్టుకు నీరివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఏకంగా 4,720 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అవసరమని నీటి పారుదల శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో కాళేశ్వరం ఎత్తిపోతల కిందే అత్యధికంగా 2,200 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం ఉంటుందని లెక్కగట్టింది. ఖరీఫ్‌ సీజన్‌లో మంచి వర్షాలతో కృష్ణా, గోదావరి బేసిన్లలోని ఎత్తిపోతల పథకాలలో కరెంట్‌ మోత తప్పింది. యాసంగిలో మాత్రం బిల్లుల మోత గట్టిగానే ఉండనుంది.

కాళేశ్వరం ద్వారా  50 టీఎంసీలు
వానాకాలంలో స్థానిక పరీవాహకం నుంచి గరిష్ట ప్రవాహాల రాకతో రిజర్వాయర్లన్నీ నిండాయి. మోటార్ల ద్వారా ఎత్తిపోతల అవసరం గణనీయంగా తగ్గిపోయింది. ముఖ్యంగా కృష్ణా బేసిన్‌లోని భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల కింద 31 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోశారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 30 టీఎంసీల మేర తక్కువ. ఈ ఎత్తిపోతల పథకాల పరిధిలోని రిజర్వాయర్లలో స్థానిక ప్రవాహాల నుంచి నీరు చేరడంతో ఒకటి రెండు మోటార్ల ద్వారానే నీటిని ఎత్తిపోçశారు. దీంతో విద్యుత్‌ వినియోగం పెద్దగా జరుగలేదు. ఇక దేవాదుల కింద కూడా కేవలం 7 టీఎంసీల నీటి ఎత్తిపోతే జరిగింది. దీని పరిధిలోని వెయ్యికి పైగా చెరువులు వర్షాలతోనే నిండాయి. కాళేశ్వరం ద్వారా వానాకాలంలో 15 టీఎంసీల కన్నా తక్కువే నీటి ఎత్తిపోతల జరిగింది.

దీంతో మొత్తంగా 2 వేల మిలియన్‌ యూనిట్లకన్నా తక్కువే విద్యుత్‌ వినియోగం జరిగింది. అయితే ప్రస్తుత యాసంగి సీజన్‌లో ప్రధాన ప్రాజెక్టుల కింద నీటి లభ్యత పుష్కలంగా ఉన్న దృష్ట్యా 33 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని ఇరిగేషన్‌ శాఖ నిర్ణయించింది. ఈ స్ధాయిలో ఆయకట్టుకు నీరివ్వాలంటే 330 టీఎంసీలు అవసరమని లెక్కగట్టింది. ఇందులో ప్రధాన ఎత్తిపోతల పథకాలైన దేవాదుల కింద 2.07లక్షల ఎకరాలకు 11.77 టీఎంసీలు, ఏఎంఆర్‌పీ కింద 2.67 లక్షల ఎకరాలకు 36 టీఎంసీలు, కల్వకుర్తి కింద 2.78 లక్షల ఎకరాలకు 37 టీఎంసీలు, ఎస్సారెస్పీ స్టేజ్‌–1, 2ల కింద కలిపి 13 లక్షల ఎకరాలకు 120 టీఎంసీలు అవసరం ఉంటుందని లెక్కగట్టింది. ఈ స్థాయిలో నీటిని ఇచ్చేందుకు ఎన్ని మోటార్లు... ఎప్పటినుంచి నడపాలి, ఎంత నీటిని ఎత్తిపోయాలి, ఎంత విద్యుత్‌ వినియోగం అవుతుందని ఇరిగేషన్‌ శాఖ అంచనాలు వేసింది. ఇందులో కాళేశ్వరం పరిధిలోని మేడిగడ్డ మొదలు, ప్యాకేజీ–8లోని గాయత్రి పంప్‌హౌజ్‌ వరకు ఐదు పంప్‌హౌజ్‌లను కనీసంగా 60 నుంచి 80 రోజుల వరకు నడపాల్సి ఉంటుందని తేల్చింది.

ఎస్సారెస్పీ కింద ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరివ్వాలంటే కాళేశ్వరం ద్వారానే కనీసంగా 50 టీఎంసీల మేర నీటిని జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎత్తిపోయాల్సి ఉంటుందని లెక్కగట్టారు. దీనికే 2,200 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అవసరం ఉంటుందని అంచనా వేశారు. ఇక దేవాదుల పరిధిలోనూ ఈ ఏడాది 11 టీఎంసీల మేర నీటి ఎత్తిపోతలకు 779 మిలియన్‌ యూనిట్లు, మహబూబ్‌నగర్‌ ప్రాజెక్టుల కింద 800 మిలియన్‌ యూనిట్లు, ఏఎంఆర్‌పీ కింద 250 మిలియన్‌ యూనిట్ల మేర విద్యుత్‌ అవసరం ఉంటుందని గుర్తించారు. మిగతా చిన్న ఎత్తిపోతల పథకాలు, ఐడీసీ పథకాలు కలిపి మొత్తంగా యాసంగిలో 4,720 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ అవసరాలను తేల్చారు. గత సీజన్‌తో పోలిస్తే ఈసారి రెట్టింపు విద్యుత్‌ వినియోగం ఉండనుంది.   

మరిన్ని వార్తలు