హైదరాబాద్‌: పెళ్లి సందడిలో హిజ్రాల హల్‌చల్‌ 

13 May, 2022 08:26 IST|Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న ఓ ఇంటికి వచ్చిన హిజ్రాలతో పాటు వారి వెంట వచ్చిన ఆటో డ్రైవర్‌ బెదిరింపులకు పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ... ఎస్పీఆర్‌హిల్స్‌ సమీపంలోని వినాయకనగర్‌లో నివాసం ఉంటున్న బి.సురేష్‌కుమార్‌ మేన కోడలు వివాహం ఈ నెల 13న జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో రాత్రి 8.30 గంటలకు నలుగురు హిజ్రాలు ఓ ఆటోలో ఆ ఇంటికి వచ్చారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో రూ. 4 వేలు ఇచ్చారు. అయినా సంతృప్తి చెందకుండా రూ. 40 వేలు కావాలంటూ నానా హంగామా చేశారు.

దీంతో ఇంటి యజమానులు వారిని బయటికి వెళ్లిపోవాలని చెప్పారు. వారితో పాటు వచ్చిన ఆటో డ్రైవర్‌ షేక్‌ అజీజ్‌ ఓ కత్తి తీసుకొచ్చి ఇంటి సభ్యులను బెదిరించాడు. మీ ఇంటిని గుర్తు పెట్టుకుంటామని తర్వాత వచ్చి అంతు చూస్తామంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ మేరకు బాధితుడు సురేష్‌కుమార్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆటో డ్రైవర్‌ అజీజ్‌తో పాటు నలుగురు హిజ్రాలపై ఐపీసీ సెక్షన్‌ 386, 506తో పాటు ఆరŠమ్స్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.   
చదవండి: రూ. కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్‌.. ‘వన్‌ ప్లస్‌’తో చిక్కాడు!

మరిన్ని వార్తలు