అనగనగా హైదరాబాద్‌.. భాగ్యనగరంలో స్వరాజ్య సమరశంఖం 

10 Aug, 2022 08:45 IST|Sakshi

జాతీయోద్యమానికి ఊపిరిలూదిన సిపాయిల తిరుగుబాటు 

స్వాతంత్య్రోద్యమానికి కేంద్రంగా అబిడ్స్, కోఠి, సుల్తాన్‌బజార్‌

వజ్రోత్సవ వేళ.. హైదరాబాద్‌ జ్ఞాపకాలు 

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరంలో ఆ రోజు మువ్వన్నెల జెండా రెపరెపలాడలేదు. దేశమంతా స్వాతంత్య్రోత్సవాలు వెల్లివిరిసిన 1947 ఆగస్టు 15న హైదరాబాద్‌లో జాతీయోద్యమ నేతలు, కాంగ్రెస్‌ నాయకులు, వివిధ వర్గాల ప్రజలు రహస్యంగానే తమ దేశభక్తిని చాటుకున్నారు. కానీ దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన జాతీయోద్యమానికి దీటుగా హైదరాబాద్‌లోనూ మహత్తరమైన స్వాతంత్య్ర పోరాటాలు జరిగాయి. న

గరంలోని అబిడ్స్, కోఠి, సుల్తాన్‌బజార్, బొగ్గులకుంట, ట్రూప్‌బజార్, కుందన్‌బాగ్‌ వంటి ప్రాంతాలు స్వాతంత్య్రోద్యమ నినాదాలతో మార్మోగాయి. గాంధీజీ పిలుపు మేరకు స్వామి రామానంద తీర్థ నేతృత్వంలో స్టేట్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో  ఉద్యమాలను చేపట్టారు. ఇదంతా ఒకవైపు అయితే భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంగా పేరొందిన సిపాయిల తిరుగుబాటు హైదరాబాద్‌లోనూ ఉవ్వెత్తున ఎగిసిపడింది. బ్రిటిష్‌ వలస పాలనను, ఆధిపత్యాన్ని ప్రతిఘటించింది.  

ఒప్పందంపై నిరసన... 
అప్పటి నిజాం నవాబు 1800 బ్రిటిష్‌ ప్రభుత్వంతో సైనిక సహకార ఒప్పందం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మేరకు బ్రిటిష్‌ అధికార ప్రతినిధికి హైదరాబాద్‌లో రెసిడెన్సీ (కోఠి)ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదే ఏడాది అక్టోబర్‌ 12 నుంచి సహకార ఒప్పందం అమల్లోకి వచ్చింది. అయితే అప్పటికే  జాతీయ భావాలతో చైతన్యం పొందిన యువత  బ్రిటిష్‌ ఆధిపత్యం పట్ల  తమ వ్యతిరేకతను చాటుకుంది.

అదే సమయంలో బెంగాల్‌ సహా  దేశవ్యాప్తంగా బ్రిటిష్‌ పాలకుల వ్యతిరేకంగా మొదలైన వహాబీ ఉద్యమం నగరంలోని  ఉద్యమకారులను ప్రభావితం చేసింది. అప్పటి నిజాం నవాబు నసీరుద్దౌలా సోదరుడు ముబారిజ్‌ ఉద్దౌలా నగరంలో వహాబీ ఉద్యమానికి సారథ్యం వహించాడు. 20 వేల మంది వహాబీ ఉద్యమకారులతో బ్రిటిష్‌ అధికార ప్రతినిధిపై దాడికి ప్రయత్నించాడనే ఆరోపణలపై నిజాం ప్రభుత్వం ఆయనను  అరెస్టు చేసి 1854లో చనిపోయే వరకు కోటలోనే బంధించారు. 
చదవండి: ఇంటిపై జాతీయ జెండా ఎగురవేస్తున్నారా?.. ఈ నియమాలు తప్పనిసరి..

నగరంలో 1857 అలజడి.. 
మీరట్, లక్నో తదితర ప్రాంతాల్లో సిపాయిలు చేపట్టిన తిరుగుబాటు హైదరాబాద్‌లో పెద్దఎత్తున అలజడిని సృష్టించింది. అప్పటికే ముబారిజ్‌ద్దౌలా మృతితో ఆగ్రహంతో ఉన్న ఉద్యమకారులు బ్రిటిష్‌  ప్రభుత్వంపై  ప్రతీకారేచ్ఛతో రగిలిపోయారు. ఈ క్రమంలోనే  హైదరాబాద్‌ కేంద్రంగా సిపాయిల తిరుగుబాటును చేపట్టేందుకు వచ్చాడనే ఆరోపణలతో జమేదార్‌ చీదాఖాన్‌ను అరెస్టు చేశారు. దీంతో బ్రిటిష్‌ ప్రభుత్వంపై ఉద్యమకారుల వ్యతిరేకత తీవ్రస్థాయికి చేరుకుంది.

జమేదార్‌ తుర్రెబాజ్‌ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్‌ల నేతృత్వంలో సుమారు 500 మంది రొహిల్లాలు 1857 జూలై 17వ తేదీన బ్రిటిష్‌ రెసిడెన్సీ కోఠిపై దాడి చేశారు. బ్రిటిష్‌ సైనికుల ప్రతిఘటనతో ఇది విఫలమైంది. ‘బ్రిటిష్‌ వాళ్లను దేశం నుంచి  తరిమివేయడమే తమ లక్ష్యమని’ తుర్రెబాజ్‌ ఖాన్‌ ప్రకటించడంతో అరెస్టు చేసి జీవిత ఖైదు విధించింది. జైలు నుంచి తప్పించుకొని పారిపోయే క్రమంలో పోలీసులు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. అతని శవాన్ని జోగిపేట వద్ద బహిరంగంగా వేలాడదీసి  ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. 
♦ఇలా నగరంలో జాతీయోద్యమానికి స్ఫూర్తినిచ్చింది ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం.  

మరిన్ని వార్తలు