సైకిల్‌వాలా జిందాబాద్‌!

5 Sep, 2020 08:26 IST|Sakshi
సైకిల్‌ ట్రాక్‌ నమూనా చిత్రం

పైలట్‌ ప్రాజెక్టుగా ఖైరతాబాద్‌ జోన్‌లో.. 46 కి.మీ

దశలవారీగా హైటెక్‌సిటీ, కూకట్‌పల్లి, చార్మినార్, దిల్‌సుఖ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో.. 

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఖైరతాబాద్‌ జోన్‌లో ప్రత్యేక సైకిల్‌ ట్రాక్‌లు ఏర్పాటు కానున్నాయి. స్మార్ట్‌ సిటీస్‌ కార్యక్రమంలో భాగంగా కేంద్రం చేపట్టిన ‘ఇండియా సైకిల్‌ 4 చేంజ్‌ చాలెంజ్‌ (సీ4సీ చాలెంజ్‌)’ అమలు చర్యల్లో భాగంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. సైకిల్‌ ఫ్రెండ్లీ సిటీస్‌గా సీ4సీ చాలెంజ్‌కు నమోదైన 95 నగరాల్లో రాష్ట్రం నుంచి హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్‌లు కూడా ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో  కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా ప్రజల్లో సైకిల్‌ వినియోగాన్ని పెంచేందుకు కూడా ఈ కార్యక్రమాన్ని అనువుగా మలచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ), హైదరాబాద్‌ యూనిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ(హుమ్టా) పూర్తి స్థాయిలో తగిన సాంకేతిక సహకారం, సలహాలు అందిస్తాయి.

పైలట్‌ ప్రాజెక్ట్‌గా తొలుత ఖైరతాబాద్‌ జోన్లో అమలు చేసేందుకు హెచ్‌ఎండీఏ, హుమ్టా, జీహెచ్‌ఎంసీలు నిర్ణయించాయి. అందుకుగాను ఆ విభాగాల అధికారులతోపాటు ట్రాఫిక్‌ పోలీసులు సైకిల్‌ ట్రాక్‌ల ఏర్పాటు తదితర అంశాలతో కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. జోన్‌లోని 23 కి.మీ.ల పొడవునా(రెండు వైపులా వెరసి 46 కి.మీ.) ఏడు సైకిల్‌ ట్రాక్‌ల మార్గాల్ని గుర్తించారు. తొలిదశలో పది కి.మీ.ల మేర అమలు చేస్తారు. ఎదురయ్యే సాధకబాధకాలు, ప్రజల స్పందన,  ఫలితాన్ని బట్టి మిగతా మార్గాల్లో ఏర్పాటు చేస్తారు. సైకిల్‌ట్రాక్‌లు అందుబాటులోకి తెచ్చే ప్రాంతాల్లో తగిన సైనేజీలు, రోడ్‌మార్కింగ్‌లు, బారికేడింగ్,   ప్లగ్‌ ప్లే బొల్లార్డ్‌ వంటివి ఏర్పాటు చేస్తారు. సైక్లిస్టుల భద్రతకు  సంబంధించి ట్రాఫిక్‌ పోలీసులు పూర్తి సహకారం అందజేస్తారు.  

దశలవారీగా 450 కి.మీ.ల మేర.. 
ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీ కోసం మెట్రో రైలు స్టేషన్లు, ఆర్టీసీ బస్‌ టెర్మినళ్లు, డిపోలు,ఎంఎంటీఎస్‌ స్టేషన్ల వద్ద అందుబాటులో ఉన్న స్థలాల్లో పబ్లిక్‌ బైసికిల్‌ షేరింగ్‌ డాక్స్‌ (పీబీఎస్‌) ఏర్పాటు చేస్తారు. భవిష్యత్‌లో దశలవారీగా సైబరాబాద్, హైటెక్‌సిటీ, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, చార్మినార్, మెహదీపట్నం, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సెంటర్, కోకాపేట ప్రాంతాల్లో 450 కి.మీ.ల మేర సైకిల్‌మార్గాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో తక్కువ దూర ప్రయాణాలకు సైకిల్‌ ప్రయాణం మేలని, అందుకు తగిన మార్గాలు అవసరమని  నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.  

చాలెంజ్‌.. రెండు దశల్లో.. 
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు  సీ4సీ కార్యక్రమాన్ని రెండు దశల్లో అమలు చేస్తారు. తొలి దశలో పైలట్‌గా సైకిల్‌ ట్రాక్‌ల ఏర్పాటు ప్రణాళిక, ప్రజల్లో అవగాహన కల్పించడం, వారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవడం వంటివి ఉంటాయి. మొదటి దశకు  అక్టోబర్‌ 14 చివరి తేదీ. దీనికి సంబంధించి 95 నగరాల నుంచి అందిన ప్రణాళికలు, అమలు, వ్యూహాలు తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని రెండో దశకు 11 నగరాలను ఎంపిక చేస్తారు. అక్టోబర్‌ 28 వరకు ఈ ఎంపిక పూర్తిచేస్తారు. ఎంపికైన  నగరాలకు  కేంద్ర హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ అఫైర్స్‌ మంత్రిత్వశాఖ కోటి రూపాయలు చొప్పున  అవార్డుగా అందజేస్తుంది. ఎంపికైన నగరాలకు జాతీయ, అంతర్జాతీయ నిపుణులు తగిన సలహాలిస్తారు. రెండో దశ సైకిల్‌నెట్‌వర్క్‌ కార్యక్రమం వచ్చే సంవత్సరం మే నెలాఖరు వరకు పూర్తికాగలదని భావిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు