10 నెలలు..రూ.365 కోట్లు 

15 Feb, 2021 08:08 IST|Sakshi

భవన, లేఅవుట్‌ అనుమతుల ద్వారా హెచ్‌ఎండీఏకు ఆదాయం

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు భవన నిర్మాణ, లేఅవుట్‌ అనుమతుల రూపంలో ‘మహా’ ఆదాయం సమకూరుతోంది. గత పది నెలల్లో రూ.365 కోట్లు హెచ్‌ఎండీఏ ఖజానాలో వచ్చి చేరాయి. ఒక్క ఏప్రిల్‌(రూ.ఏడు కోట్లు) మినహా మిగతా తొమ్మిది నెలల్లో రూ.29 కోట్లకుపైగానే డెవలప్‌మెంట్‌ చార్జీల రూపంలో ఆదాయం సమకూరింది. ఓవైపు కరోనా ప్రభావంతో రియల్‌ ఎస్టేట్‌ పడిపోయిందని వస్తున్న ఊహగానాలకు హెచ్‌ఎండీఏకు వచ్చిన ఆదాయం తెర దించినట్టైంది. ఇప్పటికీ సొంతింటి కలతో పాటు పెట్టుబడుల రూపంలో ఓపెన్‌ ప్లాట్లు, ఫ్లాట్లపై డబ్బులు వెచ్చించే వారి సంఖ్య పెరుగుతుండడంతో హెచ్‌ఎండీఏకు ఆదాయం వస్తోంది. ఎటువంటి వివాదం లేని..హెచ్‌ఎండీఏ అనుమతి పొందిన ప్లాట్లు, ఫ్లాట్లను తీసుకునేందుకు జనం ఆసక్తి చూపుతుండడంతో రియల్టర్లు వెంచర్లు, గేటెడ్‌ కమ్యూనిటీల నిర్మాణాలవైపు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.  

సెప్టెంబర్‌లో రికార్డు స్థాయిలో ఆదాయం 
కరోనా తర్వాత గతేడాది సెప్టెంబర్‌ నెలలో రికార్డు స్థాయిలో రూ.62.94 కోట్ల ఆదాయం హెచ్‌ఎండీఏకు సమకూరింది. అతి తక్కువగా ఏప్రిల్‌ నెలలో రూ.6.89 కోట్లు వచ్చింది. ఇక మేలో రూ.31.90 కోట్లు, జూన్‌లో రూ.42.20 కోట్లు, జూలైలో రూ.48.42 కోట్లు, ఆగస్టులో రూ.37 కోట్లు, అక్టోబర్‌లో రూ.32.47 కోట్లు, నవంబర్‌లో రూ.33.23 కోట్లు, డిసెంబర్‌లో రూ.41.56 కోట్లు, జనవరిలో రూ.29.35 కోట్ల ఆదాయం సమకూరినట్టుగా హెచ్‌ఎండీఏ వర్గాలు తెలిపాయి. 
చదవండి: గ్రేటర్‌లో క్యాబ్‌ డౌన్‌!

మరిన్ని వార్తలు