గల్లా పెట్టె ఘల్లుమనేలా!

22 Oct, 2022 08:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఒకవైపు సర్కారు భూముల అమ్మకాలు, మరోవైపు లేఅవుట్‌ల క్రమబద్ధీకరణ ద్వారా ఆదాయ సముపార్జనకు హెచ్‌ఎండీఏ కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్‌ల అమ్మకాలకు  చర్యలు చేపట్టిన అధికారులు.. సర్కారు ఖజానాను భర్తీ చేసేందుకు మరిన్ని చోట్ల భూముల అమ్మకాలకు ప్రణాళికలను రూపొందించారు.

హెచ్‌ఎండీఏ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో వందల ఎకరాల ప్రభుత్వ  భూములు అందుబాటులో ఉన్నాయి. కానీ చాలా చోట్ల వివాదంలో ఉండడంతో లేఅవుట్‌ల అభివృద్ధి, ప్లాట్‌ల విక్రయాల్లో జాప్యం చోటుచేసుకొంటోంది. ఈ క్రమంలో ఎలాంటి వివాదాలు లేని  భూములపై అధికారులు తాజాగా దృష్టి సారించారు. గతంలోనే అమ్మకానికి సిద్ధంచేసిన లేమూరుతో పాటు, కుత్బుల్లాపూర్‌లోని హెచ్‌ఎంటీ భూములు, ఔటర్‌కు సమీపంలోని కుర్మగూడలో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో లేఅవుట్‌లు వేసి విక్రయించేందుకు కార్యాచరణను సిద్ధంచేశారు.  

రెండు చోట్ల వెంచర్లు.. 
లేమూరులో ప్రభుత్వ భూమితో పాటు కొంత భూమిని రైతుల నుంచి సేకరించారు. సుమారు 44 ఎకరాల్లో ప్లాట్‌లను సిద్ధం చేశారు. గతంలోనే ఈ ప్లాట్‌లకు వేలం నిర్వహించాల్సి ఉండగా వివిధ కారణాలతో ఆలస్యం జరిగింది. ప్రస్తుతం లేమూరు అన్ని విధాలుగా అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు  హెచ్‌ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు. 300 చదరపు గజాలు, 200 చదరపు గజాల చొప్పున సుమారు 350 ప్లాట్‌ల వరకు లేఅవుట్‌లు వేసి  విక్రయానికి ఏర్పాట్లు చేశారు. లేమూరు భూముల అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.250కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు  అధికారులు  అంచనా వేస్తున్నారు. 

కుత్బుల్లాపూర్‌ పరిధిలోని సుమారు 90 ఎకరాల హెచ్‌ఎంటీ భూముల్లోనూ తాజాగా లేఅవుట్‌లకు సన్నాహాలు చేపట్టారు. రోడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్, తదితర అన్ని మౌలిక సదుపాయాలతో సిద్ధం చేస్తున్నారు. స్థానికంగా ఉండే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని 150 గజాల చిన్న ప్లాట్‌ల నుంచి 500 చదరపు గజాల ప్లాట్‌ల వరకు అందుబాటులో ఉంచనున్నారు.

అక్కడ గజానికి రూ.25 వేల కనీస ధర నిర్ణయించే అవకాశం ఉంది. ఔటర్‌కు సమీపంలో ఉన్న కుర్మగూడలో ప్రభుత్వానికి  మరో 60 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఇందులో ఇంకా లేఅవుట్‌ చేయాల్సి ఉంది. ఇక్కడ డిమాండ్‌ బాగా ఉంటుందని అంచనా. ఈ మూడు చోట్ల కలిపి ప్లాట్‌ల విక్రయం ద్వారా కనీసం రూ.750 కోట్లకు పైగా ఆదాయం లభించవచ్చని అధికారులు  భావిస్తున్నారు. 

క్రమబద్ధీకరణకు సన్నద్ధం... 
లేఅవుట్‌ల క్రమబదీ్ధకరణ కోసంఇప్పటికే చర్యలు చేపట్టిన అధికారులు నాలుగు జోన్‌లలో కలిపి సుమారు 1000 లే అవుట్‌లను గుర్తించారు. వారంతా గతంలోనే  ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం డాక్యుమెంట్‌లను సమర్పించారు. రూ.10 వేల ఫీజు చెల్లించారు. అధికారులు గుర్తించిన లే అవుట్‌లలో సుమారు 700 కు పైగా లేఅవుట్‌లకు ఎల్‌ఆర్‌ఎస్‌ను ఇచ్చేందుకు అవకాశం ఉంది.

ఈ స్థలాలన్నీ ఎకరానికి పైగా ఉన్నవే కావడంతో ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజుల రూపంలో  ప్రభుత్వానికి సుమారు రూ.300 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా. తాజాగా హెచ్‌ఎండీఏ  ప్రణాళికా విభాగం అధికారులతో ఈ అంశంపై సమావేశం కూడా ఏర్పాటు చేశారు. దీపావళి తర్వాత అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది.    

(చదవండి: హైదరాబాద్‌లో భారీగా హవాలా సొమ్ము స్వాధీనం)

మరిన్ని వార్తలు