Hyderabad: వివాదాస్పద 6 ఎకరాల స్థలానికి హెచ్‌ఎండీఏ ఎల్పీ.. ఇదో అంతుచిక్కని ప్రశ్న!

20 Feb, 2022 06:01 IST|Sakshi

నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ..  

వక్ఫ్‌ భూమికి హెచ్‌ఎండీఏ ఎల్పీ నంబర్‌ జారీ  

ఏకపక్ష అనుమతులపై అనుమానాలు

అధికారుల తీరుపై విమర్శల వెల్లువ  

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉన్న వక్ఫ్‌ భూమికి ఏకంగా హెచ్‌ఎండీఏ లే అవుట్‌ పర్మిషన్ (ఎల్పీ) ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వం రూపొందించిన ధరణి, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ డిపార్ట్‌మెంట్లు నిషేధిత జాబితాలో పొందుపర్చిన ఈ భూముల వివరాలను కనీసం పరిశీలించకుండా ఏకపక్షంగా అనుమతులు జారీ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

పాస్‌బుక్‌ను రద్దు చేసినా.. 
మహేశ్వరం మండలం కొంగరకుర్దు రెవెన్యూ పరిధిలోని ఔటర్‌ను ఆనుకుని సుమారు 500 ఎకరాల వక్ఫ్‌ భూమి ఉంది. 1962 నుంచి ఇప్పటి వరకు పహానీల్లో పట్టాదారు కాలంలో సయ్యద్‌ శారాజ్‌ ఖత్తాల్‌ హుస్సేన్‌సాబ్‌ దర్గా పేరిట నమోదైంది. దీన్ని వక్ఫ్‌ భూమిగా పేర్కొంటూ 2008లో ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ భూమిని సాగు చేసుకుంటున్న కొందరు రైతులు గెజిట్‌ను సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.

కోర్టు స్టేటస్‌ కో విధించింది. అప్పటి నుంచి కేసు పెండింగ్‌లోనే ఉంది. అనంతరం వక్ఫ్‌భూముల రిజిస్టేషన్లు సైతం నిలిచిపోయాయి.కానీ సర్వే నంబర్‌ 82/అ/1/1లో 11.17 ఎకరాలు ఉండగా, ఇందులో ఆరు ఎకరాలకు 2018లో ఒకరి పేరిట (ఖాతా నంబర్‌ 429 టీ 0516090202) పట్టాదారు పాస్‌బుక్‌ జారీ చేయడం.. ఒకే భూమికి రెండుసార్లు ఓఆర్సీ ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో పాటు రిజిస్ట్రేషన్లు నిషేధం ఉన్న సమయంలో కొత్త పట్టాదారు పాస్‌బుక్‌ ఎలా ఇచ్చారని స్థాని కులు రెవెన్యూ అధికారులను నిలదీశారు. రికార్డుల్లో పొరపాటున పట్టాదారుగా నమోదైందని పేర్కొంటూ, సదరు పాసుపుస్తకాన్ని రద్దు చేస్తూ 2021 జనవరి 5న ఎండార్స్‌మెంట్‌ జారీ చేశారు.  

వివాదాస్పదమని తేలినా..  
పట్టాదారు పాస్‌బుక్‌ను ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ సదరు వ్యక్తి నుంచి ఈ భూమిని నగరానికి చెందిన ఇద్దరు రియల్టర్లు కొనుగోలు చేశారు. ఈ మేరకు 20 ఏప్రిల్‌ 2021న మహేశ్వరం రిజిస్ట్రేషన్‌ ఆఫీసులో డాక్యుమెంట్‌ రిజిస్ట్రర్‌ చేయించేందుకు యత్నించగా ఇది నిషేధిత జాబితాలో ఉన్న వివాదాస్పద స్థలమని తేలింది. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పెండింగ్‌లో పెడుతూ ఇదే అంశాన్ని సంబంధిత డాక్యుమెంట్‌పై కూడా రాసి పెట్టారు.

ఇటు ధరణి, అటు రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ వెబ్‌సైట్లలో నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూమికి హెచ్‌ఎండీఏ అధికారులు తాజాగా ఎల్పీ నంబర్‌ ఎలా జారీ చేశారనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. ఫైనల్‌ లే అవుట్‌ అప్రూవల్‌ జారీ చేయాల్సిందిగా సదరు రియల్టర్లు ప్రస్తుతం తుక్కుగూడ మున్సిపల్‌ అధికారులపై ఒత్తిడి తెస్తుండడం గమనార్హం.  

చాలాసార్లు ఫిర్యాదు చేశాం 
వక్ఫ్‌బోర్డుకు చెందిన భూమిని అమ్మడం, కొనడం నేరం. కొంతమంది రియల్టర్లు దీన్ని ఆక్రమించి, చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసి ప్లాట్లు చేసి అమ్ముతున్నారు. అధికారులకు చాలాసార్లు ఫిర్యాదు చేశాం. కోర్టులో కేసు కూడా నడుస్తోంది. హెచ్‌ఎండీఏ అధికారులు లేఅవుట్‌ పర్మిషన్ ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదు. తప్పుడు రికార్డులు సృష్టించి, అధికారులను తప్పుదోవ పట్టించి భూమిని అమ్మేందుకు యత్నిస్తున్న వారిపై.. రికార్డులు పరిశీలించకుండా అనుమతులు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి.  
ఎ.శ్రీనివాస్‌గౌడ్, రావిర్యాల 

అది ముమ్మాటికీ వక్ఫ్‌ భూమే.. 
కొంగరకుర్దు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 82లోని భూమి వక్ఫ్‌బోర్డుకు చెందినదే. కొంతమంది రియల్టర్లు ఇటీవల ఆ భూమిని చదును చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. వెంటనే సిబ్బందిని అక్కడికి పంపి పనులు నిలుపుదల చేయించాం. భూమికి సంబంధించిన డాక్యు మెంట్లు ఉంటే చూపించాలని కోరాం. ఇప్పటి వరకు రాలేదు. ఈ భూమికి హెచ్‌ఎండీఏ ఎల్పీ నంబర్‌ జారీ చేసిన విషయం తెలియదు. నిషేధిత జాబితాలో ఉన్న భూమికి ఎల్పీ నంబర్‌ ఎలా ఇచ్చారనేదీ అర్థం కావడం లేదు.  
– జ్యోతి, తహసీల్దార్, మహేశ్వరం  

మరిన్ని వార్తలు