హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌లో దళారుల దందా : ఆమ్యామ్యాలు లేకుంటే పెండింగే

2 Mar, 2022 19:10 IST|Sakshi

అన్నీ ఉన్నా అనుమతులు సున్నా

నేరుగా కలిస్తేనే ఫైళ్లలో కదలిక  

సాక్షి, హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ విభాగం దళారులు, మధ్యవర్తులకు అడ్డాగా వరింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ మధ్యేమార్గంలో అధికారులను సంప్రదించాల్సిందే. లేదంటే ఫైళ్లు పెండింగ్‌ జాబితాలో పడిపోతాయి. నెలల తరబడి పడిగాపులు కాసినా అనుమతులు లభించవు. భవన నిర్మాణాలు, లేఅవుట్‌ అనుమతులు తదితర అన్ని రకాల పనుల్లో దళారుల దందానే నడుస్తోంది.

ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేసి టీఎస్‌బీపాస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించినా సకాలంలో అనుమతులు లభించడం లేదు. దీంతో గత్యంతరం లేక  మధ్యవర్తులను ఆశ్రయించాల్సివస్తోందని బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం అనుమతులకు వెళితే రకరకాల కొర్రీలు పెట్టి వెనక్కి పంపిస్తున్నారు. దీంతో వందలాది ఫైళ్లు పెండింగ్‌ జాబితాలో చేరిపోతున్నాయి. ఈ క్రమంలో ‘మధ్యేమార్గంగా’ సంప్రదించి చేయి తడిపితే  ఫైళ్లు చకచకా ముందుకు కదులుతున్నాయని భవన నిర్మాణదారులు, రియల్డర్లు చెబుతున్నారు.  

కొర్రీలు ఇలా.. 
► హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌లో సవరించిన విధంగానే వెంచర్‌కు సన్నాహాలు చేసుకొని డాక్యుమెంట్‌లు సమర్పించినా ఏదో ఓ లోపాన్ని ఎత్తి చూపుతారు. రోడ్డు వెడల్పు తక్కువగా ఉందని, వెంచర్‌లో పార్కులు, గ్రీనరీ సూచించిన విధంగా లేదని అనుమతులను నిలిపివేస్తారు. 

► నిబంధనలను అనుగుణంగా డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేసినప్పటికీ ఏదో ఒకవిధంగా కాలయాపన చేస్తే సదరు నిర్మాణదారు నేరుగా కాని, మధ్యవర్తి ద్వారా కాని కలిసేలా ఒత్తిడి తెస్తారు. దీంతో లేఅవుట్‌ పర్మిషన్‌లు, భవన నిర్మాణ అనుమతుల్లో తీవ్రమైన జాప్యం చోటుచేసుకుంటోంది.  

► ఇలాంటి జాప్యానికే కారణమైన ముగ్గురు అసిస్టెంట్‌ ప్లానింగ్‌ అధికారులు, ఓ తహసీల్దారుపై హెచ్‌ఎండీఏ కమిషనర్‌ పెనాల్టీ విధించిన సంగతి తెలిసిందే.  ఉద్దేశపూర్వకంగానే వాళ్లు  ఫైళ్లను పక్కన పెట్టినట్లు కమిషనర్‌ గుర్తించారు. 

రోజుకు 100కు పైగా ఫైళ్లు.. 
► హెచ్‌ఎండీఏ పరిధిలోని శంషాబాద్, శంకర్‌పల్లి, ఘట్కేసర్, మేడ్చల్‌ జోన్‌ల పరిధిలో రియల్‌ బూమ్‌ జోరుగా సాగుతోంది. ఇటు దుండిగల్, శంకర్‌పల్లి  నుంచి అటు చౌటుప్పల్, భువనగిరి తదితర ప్రాంతాల వరకు లే అవుట్‌ పర్మిషన్‌ల కోసం రోజుకు 100కు పైగా ఆన్‌లైన్‌ దరఖాస్తులు వస్తున్నాయి.  

► సాధారణంగా ఈ ఫైళ్లను పరిశీలించి నిబంధనల మేరకు ఫీజులు తీసుకొని అనుమతులు ఇచ్చేందుకు వారం రోజులు సరిపోతుంది. ఉద్దేశ్యపూర్వకంగా ఫైళ్లను పక్కన పెట్టడంతో రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తున్నట్లు రియల్టర్లు ఆరోపిస్తున్నారు.  

► మధ్యేమార్గంగా అధికారులను ప్రసన్నం చేసుకుంటే మాత్రం క్షణాల్లో అనుమతులు వస్తాయి. ఇందుకోసం ఎకరానికి రూ.లక్ష వరకు సమర్పించుకోవాల్సివస్తోందని ఓ మధ్యవర్తి  తెలిపారు. ‘పది ఎకరాల లోపు  వెంచర్‌లైతే కిందిస్థాయి అధికారులతోనే పని పూర్తి చేసుకోవచ్చు. భారీ ప్రాజెక్టులకు మాత్రం ఉన్నతాధికారులను సంప్రదించాల్సి ఉంటుంది’ అని వివరించారు.  

పెరిగిన పని భారం... 
► రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ను సొమ్ము చేసుకొనేందుకు కొందరు అధికారులు అక్రమాలకు తెర తీయడంతోనే కాకుండా ఒకరిద్దరు అధికారులపై పెరిగిన పని భారంతో కూడా  ఫైళ్ల పరిష్కారంలో జాప్యం జరుగుతున్నట్లు  తెలుస్తోంది.  

► శంకర్‌పల్లి, శంషాబాద్, ఘట్కేసర్‌ జోన్‌లకు మూడింటికీ ఒక్క అధికారే ఉన్నారు. పైగా అదనపు బాధ్యతలు కూడా ఉండడంతో పని భారం పెరుగుతోంది. ల్యాండ్‌ సర్వేయరు సైతం ఒక్కరే ఉండడంతో కొన్ని ప్రాంతాల్లో పనుల్లో తీవ్రమైన జాప్యం చోటుచేసుకుంటున్నట్లు నిర్మాణదారులు, రియల్టర్లు చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు