Uppal: వేలానికి 44 ప్లాట్లు.. అందరి చూపు ఉప్పల్‌వైపు.. నిబంధనలు ఇవే!

16 Nov, 2021 16:29 IST|Sakshi

చిన్న ప్లాట్లపైనే వేతన జీవుల పెద్ద ఆసక్తి 

సొంతింటి కల సాకారానికి ఎదురు చూపులు

ఉప్పల్‌ భగాయత్‌లో ప్రీ బిడ్‌ సమావేశాలు

పెద్ద ప్లాట్ల కోసం ఎదురుచూస్తున్న బడా బిల్డర్స్‌

ప్రీ–బిడ్డింగ్‌కు అనూహ్య స్పందన 

సాక్షి, హైదరాబాద్‌: ఉప్పల్‌ భగాయత్‌ లేఅవుట్‌ మధ్యతరగతి వేతన జీవుల్లో మరోసారి ఆశలు రేకెత్తిస్తోంది. సొంతింటి కలను సాకారం చేసుకొనేందుకు నగరవాసులు తూర్పు వైపు దృష్టి సారించారు. ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌ను ఆనుకొని ఉన్న విశాలమైన ఉప్పల్‌ భగాయత్‌ లేఅవుట్‌లో మిగిలిన 44 ప్లాట్లకు  ఈ– వేలం ద్వారా  విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ  నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి  తెలిసిందే.

ఈ ప్లాట్లపై నిర్వహించిన ప్రీ–బిడ్డింగ్‌ సమావేశానికి అనూహ్య స్పందన లభించింది. వివిధ వర్గాలకు చెందిన కొనుగోలుదారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులతో పాటు, బిల్డర్లు, డెవలపర్లు, పలు కంపెనీలకు చెందిన ప్రతినిధులు, ఏజెన్సీల ప్రతినిధులు సమావేశానికి హాజరై నియమ నిబంధనలను అడిగి తెలుసుకున్నారు. సందేహాలను  నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎండిఏ అధికారులు బి.ఎల్‌.ఎన్‌.రెడ్డి(చీఫ్‌ ఇంజినీర్‌),  కె.గంగాధర్‌ (ఎస్టేట్‌ ఆఫీసర్‌), సి.విజయలక్ష్మి (చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌), ఎం.రాంకిషన్‌ (ఓఎస్డీ), కె.గంగాధర్‌ (చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌), ప్రసూనాంబ (ల్యాండ్‌ అక్విజేషన్‌ ఆఫీసర్‌) ఎంఎస్టీసీ పాల్గొన్నారు. (చదవండి: ఊహించిందే జరిగింది; ఎన్నిక లేదు.. ఏకగ్రీవమే!)


మధ్యతరగతిలో కొత్త ఆశలు.. 

► సుమారు 733 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఉప్పల్‌ భగాయత్‌లో 250 ఎకరాల్లో అన్ని మౌలిక వసతులతో వెంచర్‌ను అభివృద్ధి చేశారు. విజయవాడ, వరంగల్‌ జాతీయ రహదారులకు సమీపంలో ఉన్న  ఉప్పల్‌ భగాయత్‌ మధ్యతరగతి వర్గాలను ఎక్కువగా ఆకర్షిస్తోంది. వేలం వేయనున్న 44 ప్లాట్లలో 150 గజాల నుంచి 300 గజాల వరకు ఉన్న రెసిడెన్షియల్‌ ప్లాట్లు 21 వరకు ఉన్నాయి. మిగతావి మల్టీపర్పస్‌ ప్లాట్లు ఉన్నాయి.

► గతంలో  నిర్వహించిన  వేలంలో  అత్యధికంగా  రూ.79 వేలు, కనిష్టంగా  రూ.30 వేల వరకు ధర పలికింది. దీంతో ఈసారి  వేలంలో కూడా ఎక్కువ మంది  రెసిడెన్షియల్‌ ప్లాట్లపైనే ఆసక్తి చూపుతున్నారు. (చదవండి: వన్నె తగ్గని ఉస్మానియా యూనివర్సిటీ)

► 5 వేల నుంచి 15 వేల గజాల వరకు ఉన్న కొన్ని ప్లాట్లను  కూడా  ఈసారి వేలానికి సిద్ధంగా ఉంచారు. ఆస్పత్రులు, విద్యాసంస్థలు, షాపింగ్‌ మాల్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌ వంటి భారీ వాణిజ్య భవనాల నిర్మాణం కోసం విశాలమైన ప్లాట్లు  ఉన్నాయి.

► గతంలో పెద్ద ప్లాట్లకు ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వాటిని కూడా చిన్న సైజు ప్లాటుగా అభివృద్ధి చేసి  విక్రయించాలని  స్థానికులు  డిమాండ్‌ చేస్తున్నారు.  (చదవండి: కూకట్‌పల్లి టూ కోకాపేట్‌.. త్వరలో లైట్‌ రైల్‌ ?)


నిబంధనలివీ..  

► ఉప్పల్‌ భగాయత్‌లోని  44 ప్లాట్లకు వచ్చే నెల 2, 3 తేదీల్లో ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ జరగనుంది. ఇందులో ప్లాట్లను దక్కించుకున్న వారు 90 రోజుల్లో పూర్తి స్థాయి పేమెంట్‌ చేసినట్లయితే ఆ తర్వాత మరో 15 రోజుల్లో హెచ్‌ఎండీఏ ప్లాట్లను వారి పేరిట  రిజిస్ట్రేషన్‌ చేసి అప్పగిస్తుంది.

► కొనుగోలుదారులు ఫ్లాట్‌ మొత్తం విలువలో 25 శాతం చెల్లిస్తే మిగతా మొత్తం బ్యాంక్‌ రుణంగా పొందే అవకాశం ఉంది. ఉప్పల్‌ భగాయత్‌  జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నప్పటికీ భవన నిర్మాణ అనుమతులు హెచ్‌ఎండీఏ మాత్రమే ఇస్తుంది.

► బ్యాంక్‌ చార్జెస్‌ కలుపుకొని ఈఎండీ చెల్లించాల్సి ఉంటుంది. సందేహాల నివృత్తికి హెచ్‌ఎండీఏ అధికారులను సంప్రదించవచ్చు. పౌరులందరూ ఈ బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చు. దేశంలో నివసిస్తున్న ఇతర దేశస్తులకు మాత్రం అనుమతి ఉండబోదు.  

మరిన్ని వార్తలు