Uppal: అ‘ధర’హో.. గజం రూ.1.01 లక్షలు

3 Dec, 2021 15:05 IST|Sakshi

ఉప్పల్‌ భగాయత్‌ ప్లాట్లకు భారీ స్పందన 

ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో 23 ప్లాట్లకు వేలం 

మరో 21 ప్లాట్లకు నేడు ఈ– బిడ్డింగ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఉప్పల్‌ భగాయత్‌ మరోసారి అ‘ధర’హో అనిపించింది. గురువారం హెచ్‌ఎండీఏ  ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో చదరపు గజానికి ఏకంగా రూ.లక్షా ఒక వెయ్యి ధర పలికింది. ఓ కొనుగోలుదారు 222 చదరపు గజాల ప్లాట్‌ను సొంతం చేసుకోగా, మరొకరు ఇంతే ధర చెల్లించి 368 చదరపు గజాలను దక్కించుకున్నారు. 1,196 గజాలున్న మరో ప్లాట్‌కు రూ.77 వేల ధర లభించింది. మరోవైపు గురువారం నాటి బిడ్డింగ్‌లో 1,787 గజాలున్న మరో ప్లాట్‌కు గజానికి రూ.53 వేల చొప్పున కనిష్ట ధర లభించింది.

ఈ వేలంలో సగటున గజానికి  రూ.71,815.5 చొప్పున ధర పలికినట్లు హెచ్‌ఎండీఏ  అధికారులు  తెలిపారు. గురువారం నిర్వహించిన  ఆన్‌లైన్‌ వేలంలో హెచ్‌ఎండీఏకు రూ.141.61 కోట్ల ఆదాయం లభించింది. ఉప్పల్‌ భగాయత్‌లో వేలం నిర్వహించతలపెట్టిన 44 ప్లాట్లలో సుమారు 150 చదరపు గజాల నుంచి 1,787 చదరపు గజాల వరకు మొత్తం 19,719 చదరపు  గజాల మేర విస్తరించి ఉన్న  23 ప్లాట్లకు ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ జరిగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు  నిర్వహించిన వేలంలో అత్యధికంగా రూ.77000, కనిష్టంగా రూ.53 వేలు పలికింది. మధ్యాహ్నం  నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన వేలంలో అత్యధికంగా రూ.లక్షా వెయ్యి చొప్పున, కనిష్టంగా రూ.73 వేల చొప్పున డిమాండ్‌ రావడం విశేషం. 

లుక్‌ ఈస్ట్‌ లక్ష్యంగా.. 
సుమారు రెండు వేల గజాల నుంచి 15 వేల గజాలకు పైగా ఉన్న మరో  21 ప్లాట్లకు శుక్రవారం ఈ– బిడ్డింగ్‌ జరగనుంది.  ఉప్పల్‌ భగాయత్‌లోని హెచ్‌ఎండీఏ లేఅవుట్‌ ప్లాట్లకు వేలం నిర్వహించడం  ఇది వరుసగా మూడోసారి. 2019లో  నిర్వహించిన  ఈ బిడ్డింగ్‌లో గజానికి గరిష్టంగా  రూ.79 వేలు, కనిష్టంగా రూ.36 వేల వరకు ధర పలికింది. ఈ సారి  పోటీ మరింత పెరిగింది.  
ఉప్పల్‌లో  నిర్మాణ రంగం  ఊపందుకుంది. పెద్ద  సంఖ్యలో బహుళ అంతస్తుల  భవనాలు నిర్మాణమవుతున్నాయి. మెట్రో రైలు సదుపాయంతో పాటు ఉప్పల్‌ నుంచి నగరంలోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు అనువైన రవాణా సదుపాయం ఉండడం, ఇటు  వరంగల్‌ హైవేకు, అటు విజయవాడ  హైవేకు  అందుబాటులో ఉండడంతో మధ్యతరగతి, ఉన్నత ఆదాయ వర్గాలు  ఉప్పల్‌  భగాయత్‌పై ఆసక్తి చూపుతున్నాయి.  
ఈ క్రమంలోనే ప్రభుత్వం సైతం ‘లుక్‌ ఈస్ట్‌’ లక్ష్యంతో ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపైన దృష్టి సారించింది. దీంతో  బడా  బిల్డర్లు, నిర్మాణ సంస్థలు  10  అంతస్థుల నుంచి  26 అంతస్థుల  వరకు కూడా  అపార్ట్‌మెంట్ల నిర్మాణాలను చేపట్టాయి. ఈ అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు హాట్‌ కేక్‌లా అమ్ముడవుతుండడంతో నిర్మాణ సంస్థలు ఈసారి మరింత పోటీ పడ్డాయి.  
గతంలో రూ.79 వేల వరకు డిమాండ్‌ రాగా ఈ సారి  రూ.లక్ష  దాటినట్లు  హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు  తెలిపారు. 1.35  లక్షల  చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న  44 ప్లాట్లలో 21 రెసిడెన్షియల్‌ ప్లాట్లు, 15 బహళ ప్రయోజన ప్లాట్లు ఉన్నాయి. షాపింగ్‌ కేంద్రాల కోసం మరో ప్లాట్లు, ఆస్పత్రులకు 2, విద్యాసంస్థలకు 2 ప్లాట్ల చొప్పున కేటాయించారు. 
 

మరిన్ని వార్తలు