HMDA: స్వీపర్లకు శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ల వేధింపులు

21 Sep, 2021 10:43 IST|Sakshi
ఉప్పల్‌ సర్కిల్‌ కార్యాలయం (ఫైల్‌)

సాక్షి, ఉప్పల్‌(హైదరాబాద్‌): ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిలోని శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఎఫ్‌ఏ)ల ఆగడాలు రోజు రోజుకు తారా స్థాయికి చేరుతున్నాయి. చివరకు డబ్బులిస్తేనే ఉద్యోగం చేయాలని అన్నట్లు వ్యవహారిస్తున్నట్లు ఆరోపణలు నిత్యం వెల్లువెత్తుతున్నాయి. నెల జీతం వచ్చిందంటే చాలు అప్పులోల్ల వలే ఇచ్చేదాక వెంటపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవ్వని వారిని నయాన్నో, భయాన్నో దారిన తెచ్చుకుంటున్నారు.

అడిగినంత ఇవ్వకుంటే వేధింపులు గురిచేస్తూ స్వీపర్లను నానా హింసలు పెడుతున్నట్లు బాధితులు బాహాటంగానే ఫిర్యాదులు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని వారికి అత్యవసర సమయాల్లో సెలవులు ఇవ్వరు. మెడ తిప్పనీయకుండా పనులు చెబుతూ ఆజమాయిషి చేలాయిస్తున్నారు. ఇదేమని ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా బయోమెట్రిక్‌ వారి చేతులోనే ఉంటుంది కావునా ఆడిందే ఆటగా ఎస్‌ఎఫ్‌ఎలు చలామని అవుతున్నారు. ఇదే విషయం ఉన్నతాధికారులకు తెలిసినా సున్నితంగా మందలించి వదిలేస్తూ పట్టీ పట్టనట్లుగా వ్యవహారిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

ఒక్కో స్వీపరు వద్ద ప్రతినెలా రూ. 500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. లేకపోతే వేధింపులు తప్పవని బాధితులు కిమ్మనకుండా అడిగినంతా ఇచ్చుకుంటున్నట్లు సమాచారం.‍ జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఉప్పల్‌ సర్కిల్‌లో ఎస్‌ఎఫ్‌ఎలు 22 మంది, జవాన్లు 11 మంది, 476 మంది స్వీపర్లు నిత్యం విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా శానిటరీ సూపర్‌ వైజర్‌ ఆధీనంలో ఉంటూ పనిచేస్తున్నారు. ప్రస్తుతం డీఈ స్థానంలో గతంలో ఏఎంఓహెచ్‌ ఉండే వారు. గత సంవత్సర కాలంగా ఉప్పల్‌ సర్కిల్‌లో ఆ పోస్టు ఖాళీగానే ఉంది. అదే స్థానంలో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌ మెంట్‌ డీఈని అపాయింట్‌ చేశారు.  

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.. 
ఎస్‌ఎఫ్‌ఐల వేధింపులు మా దృష్టికి రాలేదు. వేధింపులకు పాల్పడే వారిని గుర్తించి తగు చర్యలు తీసుకుంటాం. బాధితులు ఎవ్వరైన ఉంటే నేరుగా సంప్రదించి ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. 

– చందన, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌ మెంట్‌ డీఈ   

చదవండి: West Godavari: కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి

మరిన్ని వార్తలు