మూసాపేట భూమి@ రూ. 600 కోట్లు

13 Mar, 2021 10:25 IST|Sakshi

28 ఎకరాల భూమి విక్రయంతో భారీ ఆదాయం 

గంపెడాశలు పెట్టుకున్న హెచ్‌ఎండీఏ

అభివృద్ధి ప్రాజెక్టులకు ఈ సొమ్ము వినియోగించాలని యోచన

సాక్షి, సిటీబ్యూరో: నగరం నడిబొడ్డున్న ఉన్న మూసాపేట భూములు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఇక్కడి 28 ఎకరాల స్థలంలో ట్రాన్సిట్‌ ఓరియంటెడ్‌ డెవలప్‌మెంట్‌ (టీవోడీ)లో భాగంగా షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించి గదులను అద్దెకివ్వడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని తొలుత భావించినా ఆ నిర్ణయంపై హెచ్‌ఎండీఏ అడుగు వెనక్కి వేసింది.

ఈ భూమిని విక్రయించడం ద్వారా దాదాపు రూ.600 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. దీన్ని వేలం వేసేందుకు  రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఈ స్థల విక్రయంతో వచ్చే ఆదాయం ద్వారా బాలానగర్‌ భారీ ఫ్లైఓవర్,  హుస్సేన్‌సాగర్‌ సుందరీకరణ, ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై పూర్తిస్థాయిలో ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటు తదితర ప్రాజెక్టులు పూర్తి చేయవచ్చని హెచ్‌ఎండీఏ అధికారులు భావిస్తున్నారు.

దాదాపు 30 ఏళ్ల క్రితం రైతుల నుంచి 28 ఎకరాల స్థలాన్ని హెచ్‌ఎండీఏ కొనుగోలు చేసింది. అప్పటినుంచి ఈ స్థలంలో ట్రక్కులు పార్క్‌ చేస్తున్నారు. నగరానికి అవసరమయ్యే వివిధ వస్తువులు, సరుకులు తీసుకొచ్చే ఈ భారీ వాహనాల నుంచి డబ్బులు ఏమాత్రం వసూలు చేయకుండా నిలిపేందుకు అనుమతించారు. అయితే ఈ ప్రాంతం ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా కీలక ప్రాంతంగా మారడంతో భూమికి ఒక్కసారిగా డిమాండ్‌ వచ్చింది.

దీనికితోడు భారీ వాహనాలు నగరంలోకి రావడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటం, ట్రాఫిక్‌ రద్దీ పెరుగుతోందనే కారణంతో మూసాపేటలో పార్కింగ్‌ చేస్తున్న ట్రక్కులను శివారు ప్రాంతానికి పరిమితం చేస్తున్నారు. ఇప్పటికే ట్రక్కు యజమానులందరికీ సూచించిన హెచ్‌ఎండీఏ అధికారులు తొలుత పటాన్‌చెరులోని ఐదు ఎకరాల్లో వాహనాలు పార్క్‌ చేయడంతో పాటు డ్రైవర్లకు అవసరమైన కనీస వసతులు ఏర్పాటు చేస్తున్నారు.

నిర్వహణ భారం అవుతుందనే స్వస్తి
ఇక మూసాపేటలోని 28 ఎకరాల భూమిలో  షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించి గదులను అద్దెకివ్వడం ద్వారా ఆదాయాన్ని పొందాలని చూసిన..వాటి నిర్వహణ భారమవుతుందని ఈ యోచనకు స్వస్తి పలికారు. ఇప్పటికే హెచ్‌ఎండీఏకు ఉన్న వాణిజ్య సముదాయాల్లో అనేక గదులు ఖాళీగా ఉండటం ద్వారా భారీ మొత్తంలో ఆదాయానికి గండి పడుతోంది. దీనికితోడు అదనంగా నిర్వహణ భారంగా ఉండటంతో చేతుల నుంచి పెట్టాల్సిన పరిస్థితి ఉంది.

దీంతో ఆ ప్రాంతంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించడం కంటే ఆ భూమిని విక్రయించగా వచ్చే ఆదాయంతో అభివృద్ధి ప్రాజెక్టులకు ఉపయోగించేలా చేస్తే బాగుంటుందని హెచ్‌ఎండీఏ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రతిపాదన ప్రభుత్వం దృష్టిలో ఉండడంతో వచ్చే నిర్ణయాన్ని బట్టి ముందుకెళతామని ఓ అధికారి ఒకరు తెలిపారు.

చదవండి: కిక్కిరిసిన ఐటీజోన్: ఈ కష్టాలు తప్పవు మరి!‌
 

మరిన్ని వార్తలు