మంత్రి కేటీఆర్‌ చొరవ తీసుకోవాలని వేడుకోలు  

27 Aug, 2020 08:13 IST|Sakshi

భరత్‌ అనే వ్యక్తి శంకర్‌పల్లిలో 200 గజాల స్థలం కొనుగోలు చేశారు. లే అవుట్‌ రెగ్యులేషన్‌ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్‌) లేని ఆ ప్లాట్‌లో భవన నిర్మాణం చేపట్టేందుకు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు ఆన్‌లైన్‌లో డెవలప్‌మెంట్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు కావాల్సిన సేల్‌డీడ్, లింక్‌ డాక్యుమెంట్లు, పహాణీలు, పాస్‌బుక్, 13 ఏళ్ల ఈసీ, మార్కెట్‌ వాల్యూ సర్టిఫికెట్, సైట్‌ ఫొటోలు, లేఅవుట్‌ కాపీలు, ఆర్కిటెక్ట్‌ సేవలతో నిక్షిప్తం చేశారు. చివరకు ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజుపై 33 శాతం అదనంగా తీసుకొని భవన నిర్మాణానికి అనుమతి వస్తుందనుకున్న భరత్‌కు నాలా రూపంలో షార్ట్‌ఫాల్‌ వచ్చింది. ఏముందిలే.. 15 రోజుల్లో వస్తుందనుకున్నారు. కానీ.. రెండు నెలలు గడిచినా నాలా సర్టిఫికెట్‌ ఆయన చేతికి అందలేదు.

సాక్షి, హైదరాబాద్‌: ఈ పరిస్థితి ఒక్క భరత్‌కే పరిమితం కాలేదు. వందలాది మంది దరఖాస్తుదారులు నాలా సర్టిఫికెట్‌ తెచ్చుకునేందుకు రెవెన్యూ విభాగం చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నారు. ఆన్‌లైన్‌ ప్రక్రియ కాకపోవడంతో ఆ ఫైల్‌ ఎవరి వద్ద.. ఏ సమయంలో ఉందో తెలుసుకోవడం కష్టంగా పరిణమిస్తోంది. నాలా సర్టిఫికెట్‌ కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుందన్న విషయం రెండేళ్ల క్రితం హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. జీఓ 151 ప్రకారం లేఅవుట్‌ రెగ్యులేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తుల క్లియరెన్స్‌లో భాగంగా నాలా ఫీజు వసూలు చేసుకునే వీలును కల్పించినట్టుగానే భవన నిర్మాణ అనుమతుల విషయంలోనూ కల్పించాలంటూ రెవెన్యూ విభాగానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ రాసి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు మాత్రం నాలా ఫీజు వసూలుపై స్పష్టత ఇవ్వలేకపోయింది. దీంతో దరఖాస్తుదారులకు వెతలు తప్పడం లేదు.  

నెలలు గడుస్తున్నా.. 
వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్చుకునేందుకు నాన్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ అసెస్‌మెంట్‌ కింద చెల్లించేదే నాలా పన్ను. దరఖాస్తు చేసుకున్న పక్షం రోజుల్లోనే రెవెన్యూ విభాగం సర్టిఫికెట్‌ జారీ చేయాల్సి ఉండగా ఇదేమీ పట్టించుకోవడం లేదు. నెలల కొద్దీ దరఖాస్తుదారులను తిప్పించుకొంటోంది. ఫలితంగా సొంతింటి కలను సాకారం చేసుకునే క్రమంలో సామాన్యుడు బోల్తా పడుతున్నాడు. బడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆమ్యామ్యాలు చూపుతుండడంతో దరఖాస్తు చేసుకున్న పదిరోజుల్లోనే చేతికి అందిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలా సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆర్టీఓ క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి నివేదికను తహసీల్దార్‌కు రాస్తున్నారు. మళ్లీ తహసీల్దార్‌ పూర్తిస్థాయిలో తనిఖీ చేశాక తిరిగి నాలా సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ ఆర్టీఓకు నివేదిక పంపుతున్నారు. అక్కడి నుంచి అన్నీ తనిఖీ చేశాక దరఖాస్తుదారు నాలా పన్ను చెల్లించి సర్టిఫికెట్‌ తీసుకుంటున్నారు. ఈ సమయానికే మీకు పంపిన షార్ట్‌ఫాల్స్‌ నిక్షిప్తం చేయకపోవడంతో మీ డీపీఎంఎస్‌ ఫైల్‌ తిరస్కరణకు గురయ్యిందంటూ ఎస్‌ఎంఎస్‌లు రావడంతో ఏమీ చేయాలో పాలుపోక దరఖాస్తుదారులు తలలు పట్టుకుంటున్నారు.  

ఆ వెసులుబాటు కల్పించాలి..  
2015 అక్టోబర్‌ 20 నాటికి ప్లాట్‌ మీద రిజిస్టర్డ్‌ సేల్‌డీడ్‌  ఉంటేనే 33 శాతం ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుంతో హెచ్‌ఎండీఏ బిల్డింగ్‌ పర్మిషన్‌ ఇస్తోంది. జీఓ 151 ప్రకారం లేఅవుట్‌ రెగ్యులేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తుల క్లియరెన్స్‌లో భాగంగా నాలా ఫీజులు వసూలు చేసుకునే వీలును ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు కల్పించింది. ఇదే విధానాన్ని భవన నిర్మాణ అనుమతుల కోసం వచ్చేవారికి కల్పించాలని, నాలా సర్టిఫికెట్‌ కోసం రెవెన్యూ విభాగం చుట్టూ తిరగాలంటే చాలా సమయంలో పడుతోందని, ఆలోపు హెచ్‌ఎండీఏలో దరఖాస్తు చేసుకున్న డీపీఎంఎస్‌ ఫైల్‌ తిరస్కరణ గురవుతోందని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ దృష్టి సారించి హెచ్‌ఎండీఏలో సింగిల్‌ విండోలోనే పని పూర్తయ్యేలా  వెసులుబాటు కల్పించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.   

మరిన్ని వార్తలు